ఏపీలో 2019 ఎన్నికల తర్వాత జరిగే మొదటి ఎన్నిక తిరుపతి ఉపఎన్నిక. అందుకే.. ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ తిరుపతి వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, జనసేన పార్టీకి ఈ ఎన్నిక విషయంలో కొంచెం తేడా కొడుతోంది. ఈ ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో.. జనసేన కూడా అంతే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
అయితే.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి సీట్లను ఇచ్చేసి.. బీజేపీకి మద్దతు తెలుపుతూ.. జనసేన ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. కానీ జనసేన తిరుపతి ఉపఎన్నికలో ఒంటరిగా పోటీ చేయాలనుకుంది. కాకపోతే ఏపీలో బీజేపీతో మద్దతు ఉండటం వల్ల.. బీజేపీ మద్దతుతో పోటీ చేసి గెలవాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్.
కానీ.. బీజేపీ కూడా తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేయడం కోసం సమాయత్తమవుతోంది. దీంతో జనసేన అభ్యర్థికి టికెట్ దొరికే అవకాశం లేకపోవడంతో… పవన్ కూడా తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే.. నివర్ తుపాను బాధితుల కోసం పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ తరుపున దీక్ష చేపట్టారు. నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటించి బాధితులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం వాళ్లను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. నివర్ తుపాను బాధితులకు అండగా… బీజేపీ కూడా నిరసన కార్యక్రమం చేపట్టింది.
ఇక్కడ చూస్తే.. ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలే. కానీ.. పార్టీ కార్యక్రమాల పరంగా… రైతుల విషయంలో కానీ.. ఈ పార్టీల దారులు వేరు. వాటి దారులు వేరైనప్పటికీ.. వాటి టార్గెట్ వైసీపీ ప్రభుత్వమే. రెండు పార్టీలకు తిరుపతి ఉపఎన్నికలో గెలవాలని ఉంది. గెలవడం కూడా చాలా ముఖ్యం.
దీంతో… తిరుపతిలో ఎవరు బరిలోకి దిగుతారు.. అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. పేరుకు రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా.. తిరుపతి ఉపఎన్నికల్లో ఎవరికి వారే.. తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బిజేపీ తిరుపతి ఉపఎన్నికపై ఓ కమిటీని నియమించింది. జనసేన వ్యూహం కూడా వేరేలా ఉంది. రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే.. ఇక పొత్తు ఎందుకు? అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది.