చాన్నాళ్ళ తర్వాత ఆంధ్రపదేశ్ రాజకీయ నాయకుల నోట ‘భద్రాచలం’ వ్యవహారం మళ్ళీ తెరపైకొచ్చింది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, భద్రాచలం ఆంధ్ర రాష్ట్రంలో అంతర్భాగమని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించి, భద్రాచలం కూడా ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోకే రావాల్సి వుందనీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయి భద్రాచలంతోపాటు మరో రెండు మండలాల్ని ఏపీ నుంచి లాక్కున్నారని సోము వీర్రాజు ఆరోపించడం గమనార్హం.
ఉమ్మడి తెలుగు రాష్టం విడిపోయేనాటికి భద్రాచలం డివిజన్ ఖమ్మం జిల్లాలోనే వుంది. ఆ లెక్కన, ఖమ్మం జిల్లాలోని చింతూరు ప్రాంతాన్ని తెలంగాణ నుంచి విడదీసి, 13 జిల్లాల ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి కలిపారని అనుకోవాలి.
కానీ, చరిత్రలోకి తొంగి చూస్తే, ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా వుండేది భద్రాచలం రెవెన్యూ డివిజన్. కానీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఆ ప్రాంతాన్ని ఖమ్మం జిల్లాలో కలిపారు. ఒకే రాష్ట్రం గనుక అప్పట్లో పెద్దగా ఈ వ్యవహారం వివాదాస్పదం కాలేదు.
అదొక్కటే కాదు, పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన కొంత భాగాన్ని కూడా అలాగే తెలంగాణలోని ఖమ్మం జిల్లాకి కలపడం జరిగింది. ఆ ప్రాంతాల వ్యవహారమై విభజన సమయంలో పెద్ద రచ్చ జరిగింది కూడా.
కానీ, తెలంగాణ పంతమే నెగ్గింది. ముంపు ప్రాంతం పేరుతో కొంత భాగాన్ని ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి బదలాయించారు. ఆ బదలాయింపుపై ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర నాయకుల నుంచి దెప్పి పొడుపులు కనిపిస్తుంటాయి. ఆంధ్ర రాష్ట్రం నుంచి కీలకమైన ప్రాంతాల్ని తెలంగాణలో కలుపుకుని, పైగా.. సీమాంధ్రుల మీద దోపిడీ ఆరోపణలు చేయడం తెలంగాణ నాయకులకే చెల్లింది.
భద్రాచలం, ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి దూరం కావడంతో అటు ఒంటిమిట్ట, ఇటు రామతీర్థం.. దేవాలయాల్లో శ్రీరామనవమి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సి వస్తోంది. ఇన్నాళ్ళకు ఈ వ్యవహారంపై బీజేపీ గళం విప్పిన దరిమిలా, బీజేపీ నేతల్లో చిత్తశుద్ధి వుంటే, రాత్రికి రాత్రి.. ఆంధ్ర రాష్ట్రానికి దక్కాల్సిన భద్రాచలం సహా పలు ప్రాంతాలు తిరిగొచ్చేస్తాయ్. కానీ, ఆ చిత్తశుద్ధి బీజేపీకి వుందని ఎలా అనుకోగలం.?