షరామామూలుగానే చెడగొట్టుకున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ మధ్య తరచూ మాట తూలుతున్నారు. ‘గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు.. శాశ్వతంగా కనుమరుగైపోతాడు..’ అంటూ శాపనార్ధాలు పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద తన అక్కసుని చాటుకున్న చంద్రబాబు, అందరి దృష్టిలో ఇంకోసారి పలచనైపోయారు.

శాసన సభలో చంద్రబాబు సతీమణి మీద ఎవరు ఏమన్నారన్న విషయాన్ని పక్కన పెడితే, ఆ వ్యవహారంతో చంద్రబాబు విపరీతమైన సింపతీని పొందారు. అంతలా చంద్రబాబు కన్నీరు పెట్టుకుని మరీ.. వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చేసుకున్నారు మరి.

కానీ, ఇంతలోనే చంద్రబాబు తన ఇమేజ్ తానే చెడగొట్టేసుకున్నారు. తన కుమారుడి వయసున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి, ‘గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు.. శాశ్వతంగా కనుమరుగైపోతాడు..’ అంటూ వ్యాఖ్యానించడమేంటి.? చంద్రబాబుకి ఇంగితం పోతోంది బొత్తిగా.

చంద్రబాబు తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వ్యక్తం చేసిన ఆవేదన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాష్ట్ర ప్రజలూ ఇదే అంశం గురించి చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లో ఒకరితో ఒకరు బాహాబాహీకి దిగినా తప్పులేదుగానీ, ఇలా శాపనార్ధాలు పెట్టడమేంటంటూ చంద్రబాబుపై మండిపడుతున్నారు.

చంద్రబాబు సహా టీడీపీ నేతల తీరుతోనే వైసీపీ నేతలు సంయమనం కోల్పోవాల్సి వస్తోందంటూ.. వైసీపీకే ప్రజల నుంచి సింపతీ మద్దతు లభిస్తోందిప్పుడు. చంద్రబాబు తీరు తెలుగు తమ్ముళ్ళకీ నచ్చడంలేదు.