వైఎస్ జగన్ సారూ.. ప్రైవేటు ఆసుపత్రులపై ఈ మమకారమెందుకు.?

AP Govt To Set UP 16 Health Hubs, But..

AP Govt To Set UP 16 Health Hubs, But..

రాష్ట్రంలో 16 చోట్ల ‘హెల్త్ హబ్స్’ ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారులతో కీలక చర్చ నిర్వహించారు. విజయవాడ, తిరుపతి రాజమండ్రి సహా 16 చోట్ల వీటిని ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఒక్కో చోట మొత్తంగా 30 నుంచి 50 ఎకరాల భూమిని సేకరిస్తారట. ఒక్కో ఆసుపత్రికి ఐదారు ఎకరాలు కేటాయిస్తారట. మూడేళ్ళలో 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే ఆసుపత్రులకు ఈ భూములు ఇవ్వాలట. కనీసంగా 80 మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంచనా.

ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో ప్రైవేటు రంగంలో కూడా మంచి మంచి ఆసుపత్రులు వస్తాయంటున్నారు వైఎస్ జగన్. నిజానికి, మంచి ఆలోచనే ఇది. హెల్త్ టూరిజం లేదా మెడికల్ టూరిజం.. ఈ మాట తరచూ వింటున్నాం. ఫైవ్ స్టార్ హోటల్, సెవెన్ స్టార్ హోటల్ తరహాలో ఆసుపత్రులు వైద్య సౌకర్యాల్ని అందించడం ద్వారా ఈ హెల్త్ లేదా మెడికల్ టూరిజం అభివృద్ధికి దోహదపడుతున్నాయి. కానీ, ఇక్కడో పెద్ద సమస్య వుంది. అదే కార్పొరేట్ దోపిడీ. కరోనా నేపథ్యంలో ఈ కార్పొరేట్ దోపిడీ గురించి ప్రముఖంగా విన్నాం.. చూశాం. మెడికల్ ఆక్సిజన్ కోసం, రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కోసం ఆసుపత్రుల్లో బాధితులు నానా పాట్లూ పడ్డారు. లక్షలు సమర్పించుకున్నారు.

ఈ ఆసుపత్రులేవీ ప్రభుత్వాల ఆదేశాల్ని పాటించలేదు. నిజానికి, ప్రభుత్వ వైద్యమే ఎంతోమందిని కాపాడింది కరోనా నుంచి. అలాంటప్పుడు, ప్రభుత్వమే ఎందుకు వైద్య రంగంలో పెద్దన్న పాత్ర పోషించకూడదు.? ప్రభుత్వాసుపత్రులే కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో మారకూడదు.? ఈ ‘హబ్స్’ అనేవి కూడా ప్రభుత్వమే తనంతట తానుగా ఎందుకు ఏర్పాటు చేయకూడదు.? ఇలాంటి ప్రశ్నలు సహజంగానే సామాన్యుల నుంచి.. అందునా కరోనా వెతల్ని చూసినవారి నుంచి వస్తున్నాయి. కానీ, కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా ప్రభుత్వానికి పలు రూపాల్లో ఆదాయం లభిస్తుంది. అందుకే, ప్రభుత్వాలు కార్పొరేట్ ఆసుపత్రుల్ని ప్రోత్సహిస్తుంటాయి. అదే ఆ కోణమే.. ప్రజల్ని కార్పొరేట్ ఆసుపత్రులు పీల్చి పిండేయడానికి అద్భుతమైన అవకాశం.