చరిత్ర చరిత్ర అంటూ అప్పుల్లో కొత్త చరిత్ర సృష్టించారు

AP government creates new record in debts
వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా నారా చంద్రబాబు నాయుడు మీద చేసిన ప్రధాన ఆరోపణ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని.  కానీ అదే వైఎస్ జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక అప్పులు చేయడంలో చంద్రబాబును మించిపోయారు.  జగన్ సర్కార్ చేస్తున్న అప్పులు చూస్తే అసలు చంద్రబాబు ఏ మూలకు సరిపోతారు అనిపిస్తోంది.  అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త చరిత్ర సృష్టిస్తాం అంటూ ఊదరగొట్టిన జగన్ అప్పుల్లో చరిత్ర సృష్టిస్తున్నారు.  ఇప్పటికే సంక్షేమ పథకాల అమలు కోసం భారీ ఎత్తున అప్పులు చేసిన వైసీపీ సర్కార్ ఈ ఆర్తిక సంవత్సరం మొదటి రెండు నెలలు ఏప్రిల్, మే నెలల్లో రూ. 29,418 కోట్ల అప్పులు తెచ్చారు. 
 
ఈ అప్పు 2019 ఏప్రిల్, మే నెలల్లో బాబు హయాంలోని గత ప్రభుత్వం చేసిన అప్పు కంటే చాలా ఎక్కువ.  గత యేడాది చంద్రబాబు రూ.7,346 కోట్ల అప్పు చేసింది.  దాన్ని బీట్ చేసి రూ.29,418 కోట్లతో కొత్త రికార్డ్ సృష్టించారు జగన్.  ఈ అప్పుల చిట్టా చూసిన ప్రతిపక్షాలు, ప్రజలు కొత్త చరిత్ర అంటే ఏంటో అనుకున్నాం.. కానీ ఇలా అప్పుల్లో చరిత్ర సృష్టిస్తారని అనుకోలేదు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.  సరే.. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేశారు కదా సంపద సృష్టికి ఏమైనా ఆదాయ మార్గాలు క్రియేట్ చేశారా అంటే అదేం లేదు.  రాష్ట్రంలో అభివృద్ది మచ్చుకైనా కనబడట్లేదు. 
 
అంటే చేసిన పాత, కొత్త అప్పులన్నీ సంక్షేమ పథకాల కోసమే వాడేశారన్నమాట.  మొదటి యేడాదిలో జగన్ రూ.40,000 కోట్లను జనానికి పంచేశారు.  ప్రజలు లబ్ది పొందడం వరకు బాగానే ఉంది కానీ ఆదాయం లేకుండా అప్పులు తెచ్చి పంచితే రేపు ఆ అప్పులు, వాటికి వడ్డీ ఇప్పుడు లబ్ది పొందిన జనమే కట్టాలి.  ఈరోజు ప్రభుత్వం నుండి రూపాయి తీసుకున్న ప్రతి ఒక్కరూ దానికి ఇంకో పది పైసలు కలిపి పన్నుల రూపంలో మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.  లబ్ది పొందినవారే కాదు మిగతావారు కూడా అలాగే కట్టాలి.  ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైపోయింది.  పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి.  లిక్కర్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.  త్వరలో కీలకమైన ప్రభుత్వ సేవల ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది.  మొత్తానికి చరిత్ర సంగతేమో కానీ వైసీపీ సర్కార్ పదవీకాలం ముగిసేలోపు జనం చేతిలో అప్పుల చిట్టా మిగిలేలా ఉంది.