Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో నెలకొన్న నీటి వివాదాలపై చంద్రబాబు అత్యంత సున్నితంగా, అంతే స్పష్టంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
తెలంగాణతో నీటి వివాదాలపై స్పందిస్తూ, “తెలుగు జాతి ఒక్కటే, మన మధ్య విరోధాలు పెంచుకుని ఇతరులు ఆనందించే పరిస్థితి రావొద్దు” అని చంద్రబాబు హితవు పలికారు. గోదావరి నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, సముద్రంలో వృథాగా కలిసిపోతున్న నీటిని ఎవరైనా వాడుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
“గోదావరి పైభాగంలో ఉన్న దేవాదుల ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తే అవి కింద ఉన్న పోలవరానికే వస్తాయి. అలాంటప్పుడు దేవాదుల విషయంలో మేము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు కూడా అడ్డుకోలేదు” అని చంద్రబాబు గుర్తు చేశారు.
మిగులు నీటిని శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకోవడం వల్ల తెలంగాణకు కూడా లాభమేనని ఆయన సూచించారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున అక్కడ ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్త వహించాలని, కానీ గోదావరి డెల్టాను కాపాడుకుంటూ కృష్ణా-గోదావరి అనుసంధానం చేయడం వల్ల అందరికీ మేలు జరుగుతుందని వివరించారు.

పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి గత వైసీపీ ప్రభుత్వమే కారణమని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని, దీనిపై ఐఐటీ హైదరాబాద్ నిపుణులు నివేదిక ఇచ్చే వరకు వారికి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కొత్త డయాఫ్రం వాల్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఫిబ్రవరి 15లోపు వీటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని, అయితే కేవలం దర్యాప్తు పేరుతో పనులను ఆపలేమని స్పష్టం చేశారు. అనుమతులు లేని పనుల కోసం రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసి, ఎన్జీటీకి రూ. 100 కోట్ల జరిమానా కట్టే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తూ.. అబద్ధాలను వందసార్లు చెబితే నిజం కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

