చాలామందికి టీ అంటే అలవాటు కాదు.. రోజును ప్రారంభించే అవసరం. నిద్రలేవగానే చేతికి కప్పు టీ అందకపోతే ఏదో లోటు అనిపించేంతగా ఈ అలవాటు మన జీవితాల్లో భాగమైంది. అయితే అదే టీని తప్పు విధానంలో, తప్పు సమయంలో తాగితే ఆరోగ్యానికి మౌనంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా చాలామంది ఇంట్లలో కనిపించే సాధారణ అలవాటు..– చల్లారిన టీని మళ్లీ వేడి చేసి తాగడం. ఇది చిన్న విషయం లాగా కనిపించినా, శరీరంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. టీ మళ్లీ వేడి చేసినప్పుడు అందులోని సహజ గుణాలు నశించి, రసాయన మార్పులు జరుగుతాయి. టీ ఆకులు ఎక్కువ సేపు నీటిలో ఉండటం వల్ల విడుదలయ్యే ‘టానిన్’ పదార్థం చేదు రుచితో పాటు జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. ఆయుర్వేదంలో దీనిని శరీరంలో విషతుల్య పదార్థాలు పేరుకుపోయే ప్రక్రియగా పేర్కొంటారు.
టీ తాగే సమయం కూడా అంతే కీలకం. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగితే కడుపులో ఆమ్లాలు అధికమవుతాయి. దీని వల్ల ఆకలి తగ్గడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, అలసట వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల ఆహారంలో ఉన్న ఇనుము, ప్రోటీన్లు శరీరం పూర్తిగా గ్రహించలేకపోతుంది. దీర్ఘకాలంలో ఇది పోషక లోపాలకు దారితీయవచ్చు.
రాత్రి పడుకునే ముందు టీ తాగే అలవాటు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. టీలో ఉండే కెఫీన్ మెదడును చురుగ్గా ఉంచి నిద్రలేమికి కారణమవుతుంది. సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి, రక్తపోటు, అలసట వంటి సమస్యలు క్రమంగా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. నిల్వ ఉన్న లేదా మళ్లీ వేడి చేసిన టీని తరచూ తాగడం వల్ల గుండెల్లో మంట, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆయుర్వేదం ప్రకారం ఇది వాత, పిత్త దోషాలను అసమతుల్యం చేసి రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. బయటకు చిన్న అలవాటు లాగానే కనిపించినా, లోపల మాత్రం శరీరాన్ని నెమ్మదిగా బలహీనపరుస్తుంది.
అయితే టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టీ ఎప్పుడూ తాజాగా తయారు చేసుకుని తాగాలి. అతిగా మరిగించకూడదు. రోజుకు రెండు కప్పులకే పరిమితం కావడం మంచిది. చక్కెర తగ్గించి, అల్లం లేదా యాలకులు వంటి సహజ ద్రవ్యాలు కలిపితే కొంత మేలు జరుగుతుంది. సరైన పద్ధతిలో తాగితే టీ అలవాటు కాకుండా ఆరోగ్యానికి తోడుగా మారుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
