పోలవరం ప్త్రాజెక్ట్ విషయంలో కేంద్రం మోడీకి వేయడం చూస్తుంటే ఆశించిన స్థాయిలో నిధులు విడుదలయ్యేలా కనిపించట్లేదు. కేంద్రం ఇస్తానంటున్న 2013-14 అంచనా వ్యయం 20,398 కోట్లు పునరావాసానికి కూడ సరిపోవు. తాజా లెక్కల మేరకు పునరావాస అంచనా వ్యయం 30 వేల కోట్లు. ఆ లెక్కన కేంద్రం ఇస్తానంటున్న 20 వేల కోట్లు పునరావాసానికే చాలనప్పుడు నిర్మాణం ఎలా చేస్తారు అనేదే పెద్ద ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పోలవరం తుది అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని కేంద్ర జలశక్తి శాఖను కోరింది. వైఎస్ జగన్ ఇటీవల చేసిన రెండు ఢిల్లీ పర్యటనల్లో కూ ఇదే విషయాన్ని కేంద్రంతో చర్చించారు. 55 వేల కోట్లకు ఆమోదం తెలిపేలా జలశక్తి శాఖకు సూచించాలని కేంద్రం పెద్దలను కోరారు.
కానీ ఆ మంతనాలు ఫలించిన దాఖలాలు కనిపించట్లేదు. సీఎం అభ్యర్థనను పెద్దగా లెక్కలోకి తీసుకున్నట్టు లేరు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2013-14 అంచనాల ప్రకారం రూ.20,398.61 కోట్లకు మించి ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థికశాఖ చెబుతోందట. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 45.72మీటర్ల ఎత్తుకు సరిపడా భూసేకరణ, పునరావాస కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యాలకు రాష్ట్ర ప్రభుత్వం చేరుకోలేకపోయిందని అంటున్నారు. 5.72 మీటర్ల గరిష్ఠ మట్టానికి భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టాలని, 20,398.61 కోట్ల నిధులను మాత్రమే రిలీజ్ చేస్తామని అంటున్నారు. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణంలో తీవ్ర సందిగ్దత ఏర్పడినట్టైంది.
ఈ సమాచారం అందుకున్న ప్రభుత్వం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనుంది. 2017-18 నాటి అంచనా వ్యయం మేరకు 55,548.87 కోట్లను ఎలా రాబట్టుకోవాలి అనే అంశం మీద సమగ్ర చర్చ జరపనున్నారు. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే బాధ్యతను ముఖ్యమంత్రి జగన్ ఎంపీలకు అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్ పోలవరం గురించి మాట్లాడుతూ ప్రాజెక్టును పూర్తిచేసేది వైఎస్ఆర్ బిడ్డ జగన్ మాత్రమేనని గొప్పగా చెప్పారు. ఆ మాట మేరకు పోలవరం పూర్తిచేయలేకపోతే ప్రజల వద్ద మాట పోతుంది. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత చేసిన వాగ్దానాలు నీరుగారిపోయినట్టే. ఆ రిజల్ట్ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కనబడుతుంది. ఇప్పుడు చూస్తేనేమో పరిస్థితి మరింత క్లిష్టంగా తయారయ్యేలా ఉంది. మరి ఈ సంకట పరిస్థితుల్లో జగన్ కఠినమైన నిర్ణయాలు తీసుకుని కేంద్రం మీద పోరాటం చేస్తే తప్ప ఆంధ్రుల కల నెరవేరేలా కనిపించట్లేదు.