2024 నాటికైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘డిసైడ్’ అవుతుందా.?

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.? అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకడంలేదు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా అభివృద్ధి వికేంద్రీకరణ అలాగే పరిపాలన వికేంద్రీకరణ.. అంటూ ముందడుగు వేసి, మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అసెంబ్లీలో చట్టం కూడా జరిగింది. కానీ, ఈ వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో వుంది. దాంతో, ఏకైక రాజధాని అమరావతి అంశానికీ, మూడు రాజధానుల అంశానికీ మధ్య రాష్ట్ర భవిష్యత్తు ఊగిసలాడుతోంది.

2024 వరకు మాత్రమే హైద్రాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా వుంటుంది విభజన చట్టం ప్రకారం. అంటే, ఆ లోగా రాష్ట్ర రాజధాని వ్యవహారంపై నెలకొన్న వివాదాలన్నీ సద్దుమణిగిపోవాలి. లేనిపక్షంలో, రాష్ట్రం రాజధాని లేనిదిగా మిగిలిపోతోంది. రాష్ట్రం ఇంతలా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నా, కేంద్రమెందుకు ఈ విషయమై జోక్యం చేసుకోవడంలేదు.? అంటే, రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోని అంశమని కేంద్రం చెబుతోంది.. చేతులు దులిపేసుకుంటోంది.. బాధ్యతల నుంచి తప్పుకుంటోంది. అసలంటూ అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అయ్యిందే విభజన చట్టం ప్రకారం. ఆ రాజధానిలోనే హైకోర్టు ఏర్పాటయ్యింది.. అసెంబ్లీ, సచివాలయం కూడా ఏర్పాటయ్యాయి. ఏకైక రాజధాని అమరావతి మాత్రమే.. అని అయినా కేంద్రం చెప్పాలి. లేదంటే, మూడు రాజధానులకు కేంద్రం ఆమోద ముద్ర వేస్తుందనైనా చెప్పాలి. కేంద్రం చెప్పదు.. రాష్ట్రంలో వివాదం కొలిక్కి రాదు. ఎలా.? ఇంకా ఎన్నాళ్ళీ రాజధాని గందరగోళం కొనసాగుతుంది. విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా అధికార వైసీపీనే ఈ వివాదంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదేమో. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అని వైఎస్ జగన్ సర్కార్ అంటోంది గనుక, అందులో అమరావతి కూడా వుంటుందనే కోణంలో.. అమరావతిని అభివృద్ధి చేస్తే.. అది అధికార వైసీపీకే రాజకీయంగా అడ్వాంటేజ్ అవుతుంది.