2014 ఎన్నికలు వైఎస్ జగన్‌ను ప్రతిపక్షంలో నిలబెట్టాయి. ఆ దఫాలో ముఖ్యమంత్రి అయిపోదామనుకున్న ఆయనకు నిరాశే ఎదురైంది. అయినా జగన్ పెద్దగా బాధపడలేదు. కానీ పార్టీ తరపున గెలిపించుకున్న 23 ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు ఉత్తి పుణ్యానికి లాక్కెళ్ళిపోతే మాత్రం కదిలిపోయారు. తీవ్ర వేదనకు గురయ్యారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ఎదిరించి గెలిపిస్తే ఇంత పెద్ద వెన్నుపోటు పొడుస్తారా అంటూ వలసల మీదే అసహ్యం పెంచుకున్నారు. జగన్‌ను అంతలా బాధపెట్టి చంద్రబాబు పంచన చేరిన వారిలో చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడ ఒకరు. ఈయనకు జగన్‌కి మంచి సాన్నిహిత్యం ఉంది.
చంద్రబాబు సొంత జిల్లా కావడంతో అమర్నాథ్ రెడ్డి గెలుపు మీద జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు అప్పట్లో. కానీ అమర్నాథ్ రెడ్డి మాత్రం చంద్రబాబు వేసిన వలలో పడి మంత్రి పదవిని వెతుక్కుంటూ వెళ్లిపోయారు. మంత్రి పదవిలో ఉన్న ఐదేళ్లు చిత్తూరులో చక్రం తిప్పారు. జిల్లా వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకున్నారు. జిల్లాకు చంద్రబాబు తర్వాత అంతా తానే అన్నట్టు వ్యవహరించారు. ఇన్ని చేసిన ఆయన టీడీపీ శ్రేణులకు మాత్రం దగ్గరకాలేకపోయారు. పదవి కోసం పార్టీలోకి వచ్చిన ఆయన్ను అప్పటి వరకు వ్యతిరేకించిన పచ్చ శ్రేణులు ఓన్ చేసుకోలేకపోయాయి. పైగా అమర్నాథ్ రెడ్డి వెళుతూ వెళుతూ సొంత వర్గాన్ని తీసుకెళ్లారు టీడీపీలోకి. వాళ్ళే వ్యవహారం మొత్తం చెడగొట్టారని అంటుంటారు.
అప్పటివరకు నియోజకవర్గం తరపున కీలకమైన నేతలను పక్కనబెట్టి అన్నీ అమర్నాథ్ రెడ్డి వర్గమే చూసుకుంది. ఇది నచ్చని టీడీపీ శ్రేణులు గత ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డికి తమ పవర్ చూపించాయి. శ్రేణులను కంట్రోల్ చేయగలిగిన ముగ్గురు నాయకులు మొహం చాటేశారు. ఫలితంగా అమర్నాథ్ రెడ్డి ఓడిపోయారు. అప్పటి నుండి ఆయన ఎక్కువగా బెంగుళూరుకే పరిమితమయ్యారు. నియోజకవర్గాన్ని పూర్తిగా మర్చిపోయారు. దీంతో టీడీపీ నాయకులు తిరిగి పార్టీని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు అమర్నాథ్ రెడ్డికి పార్టీలో పెద్దగా పలుకుబడి లేదు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దొరుకుతుందో లేదో కూడ డౌటే.
అందుకే ఆయన తిరిగి వైసీపీలోకి వెళదామనే ఆలోచనలో కూడ ఉన్నారట. కానీ అప్పుడు జగన్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీ మారాం. ఇప్పడు వెళితే జగన్ ఆదరిస్తాడా అనే మీమాంసలో పడ్డారు. కొందరైతే జగన్ వద్ద అమర్నాథ్ రెడ్డి నమ్మకం కోల్పోయారని, కాబట్టి ఆదరించే అవకాశమా లేదని, పార్టీలో చేర్చుకున్నా ఒట్టి చేతుల్తో మిగిలిపోవాల్సిందేనని అంటున్నారు.