Janasena : జనసేనాని: ఎనిమిదేళ్ళవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.!

Janasena : ఎనిమిదేళ్ళలో జనసేన పార్టీ ఏం సాధించింది.? అని వెనక్కి తిరిగి చూసుకుంటే, జనసైనికులకి ఏమీ కనిపించడంలేదు. పోనీ, జనసేనానికి ఏమైనా కనిపిస్తోందా.? అంటే అదీ లేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చెప్పుకోదగ్ స్థాయిలోనే ఓట్లు, సీట్లు సాధించారు. పాలకొల్లులో ఓడిపోయినా, తిరుపతిలో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ విషయంలో రెండు చోట్లా ఓటమే ఎదురయ్యింది.

ఓటమి నేరం కాదు.! విజయానికి తొలి మెట్టు.! అయినాగానీ, రెండో మెట్టు ఎక్కడానికి జనసేన ప్రయత్నించడంలేదన్న విమర్శలున్నాయి. అప్పటినుంచీ ఇప్పటిదాకా చంద్రబాబు బీ-టీమ్ అనే ముద్రను చెరిపేసుకోలేక జనసేన పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.

స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ కొన్ని చోట్ల అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చింది. కానీ, జనసైనికుల్లో ఉత్సాహం ఎప్పటికప్పుడు ఉప్పొంగుతూనే, అనూహ్యంగా చల్లారిపోతుంటుంది. అందుక్కారణం, జనసేన పార్టీ నిత్యం జనంలో వుండేలా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సరైన కార్యాచరణతో ముందుకు వెళ్ళకపోవడమే.

ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు రాజకీయాలు.. ఇలా రెండు పడవల మీద రాజకీయం కష్టమే కావొచ్చు.. కానీ, ఆ కష్టాన్ని ఇష్టంగా మలచుకుని, సరైన దిశలో పార్టీని నడిపితేనే ప్రయోజనం. లేదంటే అటు సినిమాలకి న్యాయం చేయలేక, ఇటు రాజకీయాలకు న్యాయం చేయలేక.. మధ్యలో కార్యకర్తల్ని, అభిమానుల్ని బలి చేసినట్లవుతుంది. అదే జరుగుతోంది కూడా.

2024 ఎన్నికలకు ఎంతో దూరం లేదు. రెండేళ్ళ సమయం నిజానికి చాలా చాలా తక్కువే. ఈ రెండేళ్ళలో జనసేన పార్టీ ఏం చేయగలుగుతుంది.? ఎలా ముందుకు వెళ్ళగలుగుతుంది.? జనసేన ఆవిర్భావ దినోత్సవం రేపు గుంటూరు జిల్లాలో జరగనున్న దరిమిలా, పార్టీ శ్రేణులకు పవన్ ఎలా దిశానిర్దేశం చేస్తారో, తనను తాను ఎలా దిశానిర్దేశం చేసుకుంటారో వేచి చూడాల్సిందే.