3 Capitals For 13 Districts : 13 జిల్లాలకి 3 రాజధానులైతే, 23 జిల్లాలకెన్ని రాజధానులు.?

3 Capitals For 13 Districts : అదేంటో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంటే మరీ అంత వెటకారమైపోయింది అందరికీ. తెలంగాణ లాంటి అభివృద్ధి చెందిన రాష్ట్రానికే ఒకే ఒక్క రాజధాని వుంది. అంతెందుకు, దేశానికే ఒక్క రాజధాని వుంది. అలాంటప్పుడు, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులెందుకు.? అన్న ప్రశ్నకు సరైన సమాధానం అధికార వైసీపీ నుంచి రావడంలేదు.

సరే, ప్రభుత్వానికి అధికారం వుంది కాబట్టి, తమకు నచ్చిన రీతిలో రాజధానుల్ని ప్రకటించేస్తామంటే కుదరదు. ఆ విషయం వైఎస్ జగన్ సర్కారుకీ అర్థమయ్యింది.. అందుకే, మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కానీ, ఇంకోసారి మూడు రాజధానుల బిల్లు తెస్తామని వైసీపీ సర్కారు చెబుతోంది.

అప్పుడంటే 13 జిల్లాలు కాబట్టి, మూడు రాజధానులన్నారు. మరి, ఇప్పుడు 26 జిల్లాల అంశం తెరపైకొచ్చింది కాబట్టి, ఆరు రాజధానుల్ని ప్రకటిస్తారా.? అన్న చర్చ జరుగుతోంది సర్వత్రా. ఆధ్యాత్మిక రాజధాని అనీ, ఇంకోటనీ.. ఏవేవో పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. వీటిల్లో కేసినో రాజధాని.. అనే వెటకారం కూడా వినిపిస్తోందండోయ్.

ఇదిలా వుంటే, జిల్లాకో విమానాశ్రయం.. అంటూ ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారులతో సమీక్ష సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇది గతంలోని మాటే. అంటే చంద్రబాబు హయాంలోనే, జిల్లాకో ఎయిర్ పోర్ట్.. అన్న మాట వినిపించింది. మరి, వైఎస్ జగన్ సర్కారు, ఆ సంఖ్యని పెంచదలచుకుంటుందా.?

‘అమలాపురం టు రాజమండ్రి.. వయా అంబాజీపేట, కొత్తపేట, రావులపాలెం.. రావాలమ్మా రావాలి..’ అంటూ సిటీ బస్ హోరులా, విమానాల హోరు గురించి సోషల్ మీడియాలో కనిపిస్తున్న వెటకారాలు అన్నీ ఇన్నీ కావు.

మరీ ఇంత వెటకారమా.? రాష్ట్రమంటే ఎవరికీ బాధ్యత లేకుండా పోయిందెందుకు.? ఎనిమిదేళ్ళ తర్వాత కూడా, ‘మన రాజధాని ఇదీ..’ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పలేని దుస్థితి ఎందుకు వచ్చినట్టు.?