151 సీట్లు గెలిచిన వైసీపీకి రంగుల పబ్లిసిటీపై అంత అసక్తి ఎందుకు 

 
151 సీట్లు గెలిచిన వైసీపీకి రంగుల పబ్లిసిటీపై అంత అసక్తి ఎందుకు 
 
వైసీపీకి వ్యతిరేకంగా హైకోర్టు ఉత్తర్వులిచ్చిన అంశాల్లో రంగుల జీవో ఒకటి.  తాము అధికారంలో ఉన్నాం కాబట్టి రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ తమ జెండా రంగులు వేసేయాలని వైసీపీ జీవో ఇచ్చింది.  ఆ ప్రకారమే పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేసే ప్రక్రియ స్టార్ట్ చేశారు.  అయితే దీనిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.  హైకోర్టు విచారణ జరిపి పార్టీ జెండా రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయడం సరికాదని తీర్పు ఇచ్చింది.  దానిపై సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్లగా అక్కడ కూడా హైకోర్టు తీర్పునే సమర్థించారు. 
 
దీంతో సర్కార్ వెనక్కితగ్గాల్సింది పోయి మూడు రంగులకు ఇంకో రంగు కలిపి నాలుగు రంగులు వేయాలనే కొత్త జీవో ఇచ్చింది.  దీనిపై వ్యాజ్యం దాఖలవగా హైకోర్టు తీర్పును దిక్కరిస్తారా 28 నాటికి వివరణ ఇవ్వండి లేకపోతే దిక్కరణ చర్యలు మొదలుపెట్టాల్సి ఉంటుంది అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది.  అయినా తీరు మార్చుకోని జగన్ సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.  అసలు వైసీపీ ఈ రంగుల విషయంలో ఇంత మొండి పట్టుదల ప్రదర్శించడం చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. 
 
ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం ఎందుకంటే ముమ్మాటికీ ప్రచారం కోసమే.  ప్రజల కళ్ల ముందు తమ పార్టీ జెండా రంగుల రూపంలో మెదులుతూ ఉంటే నిత్య ప్రచారమే కదా అనేది వైసీపీ నేతల అభిప్రాయం.  కానీ అలా చేస్తే స్థానిక ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘన అవుతుందని ఇతరుల వాదన.  గత ఎన్నికల్లో ఓటర్లు ఏకగ్రీవ తీర్పును ఇచ్చి వైసీపీకి 151 సీట్లు కట్టబెట్టారు.  సుమారు 50 శాతానికి పైగా ఓట్లు ఆ పార్టీకే పోలయ్యాయి.  ఆంటే ప్రజల్లో ఆ పార్టీ ప్రభ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  సీఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్ చరీష్మా ప్రజెంట్ తారాస్థాయిలోనే ఉంది. 
 
ఇక కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాల కోసం భారీగా ఖర్చు పెడుతున్నారనే ఇమేజ్ కూడా ఉంది జగన్ మోహన్ రెడ్డిగారికి.  అలాంటి పార్టీ, లీడర్ ఇలా ప్రచారం కోసం ఇంతలా పాకులాడటం ఒకింత విడ్డూరంగానే ఉంది.  కోర్టు వద్దని పదే పదే చెప్పినా తీర్పుల్ని సవాల్ చేస్తూ పై కోర్టుకి వెళ్లడం, భంగపడటం చేస్తూనే ఉన్నారు.  ఇప్పుడు సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ అయినా నిలబడుతుందా అంటే ఎక్కువ శాతం నిలబడదనే సూచనలే కనిపిస్తున్నాయి.  కాబట్టి జగన్ సర్కార్ ఈ రంగుల ప్రచారానికి ఫులుస్టాప్ పెట్టి సమర్థ పాలనతోనే ప్రచారం పొందే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.