సాయిరెడ్డిగారికి క్లాస్ పీకి, కౌంటర్ ఇచ్చిన రాఘురామరాజు 

ఎంపీ రఘురామకృష్ణ రాజుకు వైసీపీ తరపున విజయసాయిరెడ్డిగారు షోకాజ్ నోటీసులు పంపిన సంగత తెలిసిందే.  అందులో పార్టీకి, పాలనకు వ్యతిరేకంగా చేసిన పలు వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు.  దీంతో రాఘురామరాజు మీద అధిష్టానం గుర్రుగా ఉందని, షోకాజ్ నోటీసులకు ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.  కానీ రాఘురామరాజుగారి స్పందన మాత్రం అనూహ్య రీతిలో ఉంది.  వివరణ ఇవ్వకపోగా విజయసాయిరెడ్డిగారికి క్లాస్ పీకి కౌంటర్ వేశారు. 
 
 
మొదటగా షోకాజ్ నోటీసుల్లో పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఉందని, కానీ ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా మేరకు తాను ఎంపీగా ఎన్నికైన పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని లాజిక్ లాగారు.  అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఇంకో పొలిటికల్ పార్టీ ఉందని, అందుకే పార్టీ పేరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా సంభోదించవద్దని ఎన్నికల కమీషన్ షరతు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.  ఈ ఒక్క చిక్కుతో అసలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుండి తనకు షోకాజ్ నోటీసులు అందలేదని, తనకు సంబధం లేని పార్టీ నుండి వచ్చిందని కనుక ఆ నోటీసులకు వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్న అభిప్రాయాన్ని పరోక్షంగా వెల్లడించారు. 
 
 
అంతేకాదు అసలు ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా విజయసాయిరెడ్డిగారు తనను తాను నియమించుకోవడం ఆశ్చర్యం కలుగించిందని వ్యంగ్యాస్త్రం సంధించిన రాజుగారు తనకు ఉన్న సమాచారం మేరకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ కమిటీ అనేది లేనే లేదని, నోటీసులు పంపే ముందు వైఎస్ జగన్ గారి అనుమతితోనే లెటర్ హెడ్ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ముద్రించారా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు.  క్రమశిక్షణా కమిటీ వేసి షోకాజ్ నోటీసులు ఇస్తేనే స్పందిస్తానని లేని పక్షంలో మిమ్మల్ని అనధికారికంగా  గుర్తించి అందరినీ తప్పుదోవ పట్టించినందుకు  చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.  సో.. రాజుగారి నుండి వివరణ కోసం ఎదురుచూస్తున్న రెడ్డిగారికి ఈ లేఖ గట్టి షాక్ ఇచ్చి ఉంటుందనడంలో సందేహమే లేదు.