ఖలీల్ వర్సెస్ నారాయణ… సింహపురిలో సత్తా చాటేదెవరు?

నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయనేది తెలిసిన విషయమే. ముఖ్యంగా నెల్లూరు సిటీ సీటు ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. అనూహ్య రాజకీయ పరిణామాలకు వేదికగా మారిన నెల్లూరు సిటీలో గెలుపు వైసీపీకి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి నారాయణకు చెక్ పెట్టేందుకు వైసీపీ అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటుందని తెలుస్తుంది.

మొత్తం 28 డివిజన్లు, ఒక లక్షా 56 వేల ఓట్లు ఉన్న నెల్లూరు సిటీ సెగ్మెంట్‌ లో 2014 నుంచి ఇక్కడ ఫ్యాన్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. అయితే… నియోజకవర్గ మార్పు చేర్పుల్లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌.. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళ్లిపోవడంతో ఈసారి మైనార్టీ నేత ఖలీల్‌ కు అవకాశం ఇచ్చింది వైసీపీ. దీంతో ఈసారి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సరికొత్త పోరు తెరపైకి వచ్చింది. మరోపక్క కూటమి అభ్యర్థిగా ఆర్ధికంగా బలంగా ఉన్న పొంగూరు నారాయణ బరిలో నిలుస్తున్నారు.

గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన నారాయణ ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తుండగా.. అధిష్టానం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖలీల్‌ చెమటోడ్చుతున్నారు. ఈ సమయంలో… నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తుండటంతో ఖలీల్ కు అన్ని రకాలుగానూ సహాయసహకారాలు అందుతున్నాయని తెలుస్తుంది.

ఇలా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డి కూడా ఖలీల్ విజయానికి శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఎంట్రీతో నారాయణ అదనపు శక్తిని కూడగట్టుకున్నారని.. ఫలితంగా, ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగరేస్తాననే ధీమా ప్రదర్శిస్తున్నారని అంటున్నారు.

మరోవైపు తమ కంచుకోటగా ఉన్న నెల్లూరు సిటీ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని వైసీపీ భావిస్తుంది. గతంలో రెండు సార్లూ బీసీ సామాజికవర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ కి టిక్కెట్ ఇచ్చిన వైసీపీ ఈసారి సిటీలో సుమారు 46 వేల ఓట్లు ఉన్న మైనారిటీ వర్గానికి చెందినవారికి టిక్కెట్ ఇచ్చింది. దీంతో ఆ ఓట్లన్నీ వైసీపీకి గంపగుత్తగా పడటంతో పాటు ఎస్సీ, బీసీల ఓట్లు మెజారిటీ షేర్ దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదే సమయంలో… తనకున్న అంగబలం, అర్ధబలానికి తోడు బీజేపీ, జనసేన కేడర్ కూడా కలిస్తే విజయం తనకే దక్కుతుందనే ధీమా నారాయణలో ఉందని చెబుతున్నారు. మరి ఎవరి ధీమా గెలుస్తుందనేది వేచి చూడాలి!

కాగా… 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్… టీడీపీ అభ్యర్థి క్రిష్ణారెడ్డిపై 19,087 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా.. 2019 ఎన్నికల్లో నారాయణపై 2,988 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ సమయంలో నారయణ మరోసారి అదృష్టాన్ని పరిక్షించుకుంటుండగా.. ఈసారి వైసీపీ నుంచి ఖలీల్ బరిలోకి దిగుతున్నారు.