వైసీపీ సర్కార్‌కు మైండ్ బ్లాక్.. ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు 

 
వైసీపీ సర్కార్‌కు మైండ్ బ్లాక్.. ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు 
 
 
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి తగులుతున్న ఎదురుదెబ్బల పర్వం ఇంకా కొనసాగుతోంది.  రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవి నుండి తొలగించడం సరికాదని, ఆయన పదవిలో కొనసాగవచ్చని హైకోర్టు తీర్పు వెలువరించింది.  ఇది నిజంగానే వైఎస్ జగన్ సర్కార్ షాకయ్యే తీర్పే అనాలి.  ఎందుకంటే ఏపీ ప్రభుత్వం రమేష్ కుమార్‌ విషయంలో చాలా పట్టుదలగా వ్యవహరించింది.  ఏకంగా ఎన్ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ రమేష్ కుమార్‌ను పదవి నుండి తొలగించారు.  
 
స్థానిక ఎన్నికలను నిర్వహించాలని జగన్ సర్కార్ పట్టుబట్టగా రమేష్ కుమార్‌ మాత్రం కరోనా ప్రమాదకరంగా ఉందని, ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  దీనిపై వైఎస్ జగన్ నేరుగా విమర్శలకు దిగారు.  ఎస్ఈసీ పదవీకాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ తెచ్చి ఆ నియమం ప్రకారం రమేష్ కుమార్‌ను తొలగించి ఆయన స్థానంలో మాజీ హైకోర్టు న్యాయమూర్తి కనగరాజ్‌ను నియమించారు.  దీంతో ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుందని పిటిషన్లు దాఖలయ్యాయి.  
 
నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైతం కోర్టులో పిటిషన్ వేశారు.  పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేస్తూ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొనసాగవచ్చని తీర్పు వెలువరించింది.  దీంతో పట్టుబట్టి ఆయన్ను పదవి నుండి తొలగించిన వైసీపీ సర్కార్ నిర్ణయం తప్పని కోర్టు తెలిపినట్టైంది.  ఈ తీర్పుతో ప్రస్తుత ఎస్ఈసీ రమేష్ కుమారే అయ్యారు.  మరి ఈ తీర్పు పట్ల ఏపీ ప్రభుత్వం తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాలి.