తెలంగాణలో చలి.. ఏపీలో వర్షల హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండగా, అటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే రెండు రోజులు పొడి వాతావరణం కొనసాగుతుందని, అదే సమయంలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. బుధవారం నుంచి చలి ప్రభావం మరింతగా కనిపిస్తోంది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. పలు జిల్లాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండగా, ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కరీంనగర్, వరంగల్, జగిత్యాల, నిజామాబాద్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తాజా నమోదుల ప్రకారం ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 16.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 7.7 డిగ్రీలు నమోదయ్యాయి.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మరోలా మారుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, భూమధ్యరేఖకు సమీపంలోని తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది గురువారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాతానికి చేరుకునే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ వాయుగుండం ప్రభావంతో ఈ నెల 10, 11 తేదీల్లో రాయలసీమతో పాటు దక్షిణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కూడా అధికంగా ఏర్పడవచ్చని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి.మాడుగులలో అత్యల్పంగా 2.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 20.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తంగా చూస్తే, ఒకవైపు తెలంగాణలో చలి గజగజ వణికిస్తుండగా, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.