బడ్జెట్ ఆమోదం పొందలేదు.. అయినా ప్రభుత్వానికి నష్టమేమీ లేదు 

మొన్న జరిగిన శాసన మండలి సమావేశంలో ముఖ్యమైన ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు.  బహుశా ఇలా ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందకుండా మండలి నిరవధిక వాయిదా పడటం ఇదే ప్రథమం అనుకోవచ్చు.  శాసన సభలో ఆమోదం పొందిన బడ్జెట్ ను పూర్తి వివరాలతో, శాఖల వారీగా కేటాయింపులు చూపుతూ, ఎలా ఖర్చు చేయనున్నారు అనే పద్దులతో పెద్దల సభకు వస్తుంది.  అలా వచ్చినప్పుడు మహా అయితే కొన్ని సవరణలత బిల్లు ఆమోదం పొందడం ఆనవాయితీ.  కానీ ఈసారి బిల్లు చర్చకు రాకుండానే మండలి వాయిదాపడింది.  ఈ బిల్లు ఆమోదం పొందకపోతే ఖజానా నుండి నిధులు ఖర్చు చేయడం ప్రభుత్వానికి వీలుపడదు. 
 
సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ పరిణామం కొంత ఇబ్బందికరమే అవుతుంది.  కానీ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మూడు నెలలకుగాను ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టారు కాబట్టి ఎలాంటి ఇబ్బందీ లేదు.  ఇక అసలు బడ్జెట్ అమలు సంగతేమిటంటే దానికి కూడా ప్రభుత్వం పెద్దగా అడ్డంకులు ఉండవు.  సాధారణంగా మనీ బిల్లుల విషయంలో శాసన మండలికి పెద్దగా అధికారాలు ఉండవు.  గౌరవప్రదంగా ఆమోదించటం, మార్పులు చెప్పడం మినహా ఆపడం లాంటి అధికారాలు ఉండవు.  
 
ఇక మండలి నిరవధిక వాయిదా పడిన నేపథ్యంలో బడ్జెట్ ఆమోదం పొందడం ఎలా అంటే మళ్లీ మండలి సమావేశం పెట్టి చేసుకోవచ్చు.  కానీ పెట్టినా టీడీపీ, వైసీపీలు మళ్లీ కొట్టుకుంటాయి.  పరస్పర అంగీకారంతో బిల్లును ఆమోదించటం అంటూ జరగదు.  టీడీపీ మొదట ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపి మూడు రాజధానుల బిల్లు చర్చకు రాకుండానే మండలిని వాయిదా వేయడానికే చూస్తుంది.  కాబట్టి మరోమారు సమావేశం పెట్టి లాభం లేదు.  ఎలాగూ శాసనమండలిలో ఒక బిల్లు ప్రవేశపెట్టాక దాని మీద మండలి 14 రోజుల్లోపు వివరణ ఇవ్వాలి.  అలా ఇవ్వని నేపథ్యంలో 14 రోజుల తర్వాత బిల్లు దానికదే ఆమోదం పొందినట్టు అవుతుంది.  సో.. మండలి ఆమోదం తెలపకపోయినా కొత్త బడ్జెట్ 2020 -21 ఇంకో 12 రోజుల్లో అమలులోకి వచ్చేస్తుంది.