ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాలు, కేసీఆర్ ప్రత్యర్థులు ప్రధానంగా పట్టుకుని గోల చేస్తున్న అంశం కేసీఆర్ కనిపించడంలేదు. జూన్ 28న లాక్ డౌన్ మీద ప్రకటన చేసిన తర్వాత గజ్వేల్ ఫామ్ హౌజుకు వెళ్లిపోయారని, సిటీలో ప్రమాదకర పరిస్థితులు ఉండటంతోనే అక్కడికి వెళ్లిపోయారని, ప్రజలు ప్రమాదంలో ఉంటే ఇలా సీఎం వదిలేసి వెల్లిపోతారా, ఇది బాధ్యతా రాహిత్యం అంటూ పెద్ద గోల చేశారు. కొందరు యువకులు వేర్ ఈజ్ కెసీఆర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కొన్ని మీడియా మాధ్యమాలు ముఖ్యమంత్రికి కరోనా సొకిందని, క్వారంటైన్లో ఉన్నారని ప్రచారం చేశారు.
ఇక ప్రధాన ప్రతిపక్షాలు కేసీఆర్ అందుబాటులో లెకపోవడం వలన ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయాయని అన్నారు. కానీ ఎక్కడా ఆ దాఖలాలు కనబడలేదు. అన్ని శాఖలు యధావిధిగా పనిచేస్తున్నాయి. అసలు కేసీఆర్ కనిపించకపోవడాన్ని పెద్ద తప్పిదంలా చూపడం ఎంత వరకు సమంజసం. కేసీఆర్ ముఖ్యమంత్రే కావొచ్చు. అయినా ఆయనకూ వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది. ఆయనకూ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వాటి పట్ల ఆయనే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ దగ్గు, జలుబు లాంటి లక్షణాలు రావడంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లి ఉండచ్చేమో.
అందులో తప్పేముంది. కరోనాకు సామాన్య ప్రజలు, ముఖ్యమంత్రి అనే తేడా తెలియదు. కేసీఆర్ వయసు ఆరు పదులు. కోవిడ్ నిబంధనల మేరకు 60 సంవత్సరాల వయసున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండటం ఉత్తమం అని వైద్యుల సలహా. ఆ ప్రకారం చూసుకున్నా కేసీఆర్ బయటకు రాకపోవడంలో తప్పేం లేదు. ఇక్కడ చూడాల్సిందల్లా పాలన నడుస్తుందా లేదా, కరోనా కట్టడిలో సర్కార్ తీరు ఎలా ఉంది అనేది. అంతేకానీ ముఖ్యమంత్రి మిస్సింగ్ అని ప్రచారం కాదు. హైకోర్టు కూడా కేసీఆర్ కనిపించట్లేదని దాఖలైన పిటిషన్ మీద ఇలాగే స్పందించింది. న్యాయ వ్యవస్థలను రాజకీయ జిమ్మిక్కులకు వాడుకోవడం సరికాదని హెచ్చరించింది.