కేంద్రానికి జగన్ అవసరం వచ్చేదెప్పుడు.. హోదా ఇచ్చేదెప్పుడు 

 

కేంద్రానికి జగన్ అవసరం వచ్చేదెప్పుడు.. హోదా ఇచ్చేదెప్పుడు 

 
ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ తనకు అత్యధిక ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని అన్నారు.  ఆయన మాట ప్రకారమే ఏపీ ప్రజలు 22 ఎంపీ స్థానాలు కట్టబెట్టారు.  కానీ వైఎస్ జగన్ మాత్రం కేంద్రానికి కావాల్సినన్ని ఎంపీ స్థానాలు ఉన్నాయని, కాబట్టి మనకు లొంగరని చేతులెత్తేశారు.  ఇక తాజాగా మాట్లాడిన ఆయన హోదా తెస్తామని కానీ కేంద్రానికి మన అవసరం వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమని మెలిక పెట్టారు.  మరి మోడీకి జగన్ అవసరం ఎప్పుడొస్తుందా అని జనం ఆలోచనలో పడ్డారు. 
 
రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ అవసరం ఉంది.  ఈ ఎన్నికల్లో ఏపీ నుండి నలుగురు అభర్థులు పోటీలో ఉన్నారు.  మొత్తం 55 స్థానాల్లో 37 ఎకగ్రీవం మిగిలిన 18 స్థానాలకు ఈ నెల 26న పోలింగ్ జరగాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడ్డాయి.  ఈ 18 స్థానాల్లో ఏపీ 4 స్థానాలు కూడా ఉన్నాయి.  ఎమ్మెల్యేల సంఖ్యా బలం రీత్యా ఈ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  ఇప్పటికే శివసేన లాంటి ప్రాంతీయ పార్టీకు కూటమి నుండి వైదొలగడంతో బీజేపీకి ప్రాంతీయ పార్టీల అండ కావాల్సి ఉంది.  రాజ్యసభలో మెజారిటీ బలం లేకపోతే కీలక బిల్లులను పాస్ చేయించుకోవడం కష్టం. 
 
కాబట్టి భాజాపా తప్పకుండా వైసీపీ మద్దతు కోరతారు.  ఇప్పటికే మోడీకి కేంద్ర స్థాయిలో అన్ని విధాలా సహకరిస్తున్న వైఎస్ జగన్ వెనుకాడకుండా మద్దతు ఇస్తారు.  అయితే ఈ మద్దతుకు ప్రతిఫలంగా వైఎస్ జగన్ ఏ ప్రయోజనాలను తీసుకుంటారు అనేదే తేలాల్సిన అంశం.  కొందరు మాత్రం ఈ మద్దతుకు బదులుగా జగన్ తన మీదున్న కేసుల వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చుకోవడం, క్యాబినెట్లో ఒక రెండు స్థానాలు దక్కించుకోవడం లేకపోతే ఎన్డీఏ మిత్ర పక్షంగా మారిపోయి ఇతర ప్రయోజనాలు పొందడం లాంటివి చేస్తారే కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేననే డిమాండ్ మాత్రం చేయరనే విమర్శలు వినిపిస్తున్నాయి.  మరి ఈ విమర్శలన్నీ దాటుకుని జగన్ భాజాపా ముందు హోదా అంశాన్ని బలంగా వినిపిస్తారేమో చూడాలి.