ఈ సమయంలో ప్రభుత్వం చూపాల్సింది లెక్కలు కాదు మానవత్వం

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.  ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు.  దీంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ స్టార్ట్ చేశారు.  ఈలోపే లాక్ డౌన్ వలన బస్సులన్నీ నిలిచి పోవడంతో ఆర్టీసీకి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది.  అసలే అప్పులు వాటికి తోడు లాక్ డౌన్ ప్రభావంతో ఎఫెక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మీద పడింది.  మే నెల మధ్యలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరూ విధుల్లోకి రానవసరం లేదని ఆర్టీసీ తెలిపింది.  దీంతో ఉద్యోగ సంఘాలు నిరసన తెలిపాయి.  అప్పటికప్పుడు మంత్రి పేర్ని నాని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడలేదని ప్రకటన చేశారు. 
 
 
మళ్లీ తాజాగా అధికారులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇక మీదట విధులకు రానక్కర్లేదని తేల్చి చెప్పారు.  ఈ మేరకు డిపో, రీజినల్ మెనేజర్లు ఉద్యోగులకు ఉత్తర్వులిచ్చారు.  కాల పరిమితి ముగియడం మూలాంగాంనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.  దీంతో 7800ల మంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి.  ఎన్నో ఏళ్ల నుండి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వీరంతా ఆర్టీసీ అప్పుల్లో ఉండి రెండు మూడు నెలల జీతాలు ఆలస్యం చేసినా సర్దుకుని విధులు నిర్వర్తించిన సందర్భాలు చాలాంనే ఉన్నాయి.  అలాంటి వారిని ఉన్నపళంగా విధుల నుండి తొలగించడం మానవత్వం అనిపించుకోదు.  
 
 
ప్రైవేట్ సంస్థలకు ఈ కరోనా కష్ట కాలంలో ఉద్యోగులను తొలగించవద్దని చెబుతున్న ప్రభుత్వమే ఇలా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడానికి పూనుకోవడం సమంజసం కాదు.  ఇక ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయిన వేళ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నిర్వహించడం కష్టమని అధికారులు అంటున్నారు.  కానీ ఎలాంటి ఆదాయం లేకున్నా ఇచ్చిన హామీల కోసం ప్రభుత్వ ఆస్తులను అమ్మి అయినా సంక్షేమ పథకాల పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంచుతున్నారు.  అలాంటప్పుడు తమ కోసం పనిచేసిన, చేస్తామంటున్న ఉద్యోగులను కూడా ఏదో రకంగా సర్దుబాటు చేసుకుని ఆదుకోవాల్సిన భాద్యత ప్రభుత్వానిదే.