ఈ సంక్రాంతి సంబరం వెండితెరకు బాగా వేడిమిని పుట్టించనుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.. ఈ సారి సంక్రాంతి సినిమాల చుట్టూ రాజకీయ వాతావరణం చోటుచేసుకోనుందని చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ పండగకు మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ , నందమూరి నటసింహం బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలు పోటీకి సై అంటూ కాలు దువ్వుతున్నాయి. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికే విడుదలవుతుండడంతో ఇరువర్గాల అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి యూరప్ లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రీకరణలో మెగాస్టార్ తో పాటు శృతిహాసన్ పాల్గొంటోంది.
కాగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలోనే తెరకెక్కుతోన్న ఇంకో సినిమా ‘వీర సింహా రెడ్డి’. బాలకృష్ణ హీరోగా ఈ సినిమా నిర్మితమవుతోంది. రెండు సినిమాల్లోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండడం గమనార్హం. రెండూ సంక్రాంతికే విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాల పబ్లిసిటీ చిత్ర నిర్మాణ సంస్థకు కత్తి మీద సాము లాంటిదే. నందమూరి బాలకృష్ణ సినిమాకి ఎలాగూ టీడీపీ నుంచి సపోర్ట్ లభిస్తుంది. అదే టీడీపీ నుంచి ‘వాల్తేరు వీరయ్య’కి నెగెటివిటీ తప్పదు.
ఇంకోపక్క, వైసీపీ నుంచి ‘వాల్తేరు వీరయ్య’పై నెగెటివిటీ కనిపిస్తోంది. జనసేన నుంచి ‘వాల్తేరు వీరయ్య’కు పాజిటివిటీ వుండడం మామూలే. వెరసి, సంక్రాంతి సినిమాల చుట్టూ చాలా రాజకీయమే వుండబోతోంది. నెగెటివిటీని ఎదుర్కోవడం చిరంజీవికి కొత్త కాదు. కానీ, ‘ఆచార్య’ విషయంలో ఆ నెగెటివిటీ కొంప ముంచిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ విషయంలో నెగెటివిటీ ఏ మాత్రం పనిచేయలేదు. ‘వాల్తేరు వీరయ్య’పై నెగెటివిటీని, ఫ్రీ పబ్లిసిటీగా మెగాస్టార్ చిరంజీవి తీసుకుంటున్నారట. బోల్డంత ఖర్చు చేసి, సినిమాపై నెగెటివిటీ కోసం ఓ వర్గం ప్రయత్నిస్తోందని మెగా కంపౌండ్ విశ్వసిస్తోంది. మరి ఈ సంక్రాంతి పోరు ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే!