Asia Icon 2024: ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక మాజీ అధ్యక్షుడు గౌరవనీయులైన శ్రీ. మైత్రిపాల సిరిసేన డాక్టర్ కలశ నాయుడిని ఆసియా ఐకాన్ 2024గా సత్కరించారు.
– కొలంబోలో అవార్డు తీసుకున్న డా. కలశనాయుడు మేడపురెడ్డి ప్రపంచంలోని అతి చిన్న వయస్కురాలైన సోషల్ వర్కర్ డా. కలశనాయుడు ఇప్పుడు ఆసియా ఐకాన్ గా మారారు. సోషల్ సర్వీస్ రంగంలో కలశనాయుడు చేస్తున్న సేవలకు గాను ఆ చిన్నారిని ఆసియా ఐకాన్ అవార్డు 2024 వరించింది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఈనెల 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన ఆసియా ఐకాన్ అవార్డ్స్ 2024 ప్రదానోత్సవ కార్యక్రమంలో డా. కలశనాయుడు అవార్డును స్వీకరించారు. కొలంబో గవర్నర్ సెంథిల్ చేతుల మీదగా డా. కలశనాయుడు ఆసియా ఐకాన్ 2024 అవార్డును తీసుకున్నారు. ఈ సందర్భంగా కలశనాయుడును వేదికపై ఉన్న ఆహుతులు ప్రశంసలతో ముంచెత్తారు. అతి చిన్న వయసులోనే అకుంఠిత సేవాభావంతో పని చేస్తున్న కలశనాయుడునేటి తరానికి ఆదర్శమని అభినందించారు. అంతేకాదు 11 ఏళ్ల ఆ చిన్నారి సాధించిన విజయాలు, అవార్డులు, రివార్డుల గురించి తెలిసి ఆశ్చర్య పోయారు. ఐక్యరాజ్యసమితి కలశనాయుడును గ్లోబల్ యంగెస్ట్ సోషల్ వర్కర్ బిరుదుతో సత్కరించడం, సేవారంగంలో ఆ చిన్నారి చేసిన సేవలకు గాను యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ గౌరవ డాక్టరేట్‌తో సన్మానించడం ఆసియా ఖండానికే గర్వకారణమని అన్నారు.
కలశ ఫౌండేషన్ ద్వారా డా. కలశనాయుడు ప్రపంచవ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో 2013, ఆగస్ట్ 30న ప్రారంభమైన కలశ ఫౌండేషన్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జిల్లాలు, రాష్ట్రాలు, దేశం కూడా దాటి అంతర్జాతీయంగా సేవాకార్యక్రమాలను నిర్వహిస్తోంది. సమాజ సేవే పరమావధిగా ఎన్నో ఉన్నతాశయాలతో కలశ తండ్రి డాక్టర్. నూతననాయుడు మేడపురెడ్డి ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. కలశ పుట్టిన క్షణంలోనే ఫౌండేషన్ ప్రారంభించిన డా. నూతననాయుడు పాప పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. సేవా కార్యక్రమాలతో పాటు పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తింపు ప్రతి ఏటా కలశ అవార్డులు కూడా ప్రదానం చేస్తున్నారు.
తండ్రి స్థాపించిన ఫౌండేషన్ ఆశయాలను ఐదేళ్లకే అర్థం చేసుకున్న చిన్నారి కలశనాయుడు తాను కూడా అందులో భాగమైంది. ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను నూతన నాయుడు రాష్ట్రస్థాయిలో నిర్వహించగా, ఆ స్ఫూర్తితో ఆ కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు కలశనాయుడు. ప్రస్తుతం కలశ ఫౌండేషన్ ద్వారా సుమారు 135 దేశాల్లో సేవా కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయి. స్థానిక స్వచ్ఛంధ సంస్థలు, వ్యక్తుల పరస్పర సహకారంతో కలశనాయుడు తన ఫౌండేషన్ కార్యకలాపాలను విస్త్రతం చేస్తోంది. తల్లిదండ్రులు డా. ప్రియా నాయుడు, డా. నూతన నాయుడు గైడెన్స్‌తో కలశ ఫౌండేషన్ ద్వారా సమాజసేవ చేస్తున్న డా. కలశనాయుడుకు అభినందనలు..