వయనాడ్ కొచ్చి రాహుల్ గాంధీ తప్పు చేస్తున్నారా?

కేరళలోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం రెండోస్థానంగా ఎంచుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పు చేశారా?

ఈ విమర్శ సెక్యులర్ పార్టీలలో బలంగా వినబడుతూ ఉంది. ఆయన రాకతో  వయనాడ్ ఒక విచిత్రమయిన పోటీ ఎదుర్కొంటున్న నియోజకవర్గంగా మారింది.

ఎందుకంటే, దేశమంతా భారతీయ జనతాపార్టీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ,రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఆ పార్టీకి చెందిన నేతలు ప్రచారం చేస్తున్నారు. మోదీని ఓడించండని ప్రజలుకు పిలుపునిస్తున్నారు. ఎక్కడయినా రాష్ట్రాలలో కాంగ్రెస్ బలహీనంగా ఉండి, బిజెపిఅనుకూల ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నా కూడా రాహుల్ ఇదే ప్రచారం చేస్తున్నారు.

దీనికి భిన్నంగా వయనాడ్ లో ఆయన బిజెపిని విస్మరించాలి. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. బహుశా ప్రచారం చేయకుండా ఆయన తప్పించుకోవచ్చు. అయినా ఒకటో రెండో సమావేశాలలో ఆయన ప్రజలను ఓట్లడగాలి. ఏమని అడగాలి?

వయనాడ్ లో ఆయన ఎవరిని ఓడించి, కాంగ్రెస్ ను గెలిపించండని ప్రజలనుకోరతారు. దేశంలో ని అన్ని నియోజకవర్గాలలో ఆయన మోదీని ఓడించండని పిలుపు నిచ్చి ఒక్క వయనాడ్ లో మాత్రం ఆయన కమ్యూనిస్టుల కూటమిని ఓడించండని పిలుపునివ్వాలి.

అక్కడ బిజెపిని, మెదీని తిడితే ప్రయోజనం లేదు. ఎందుకంటే, వయనాడ్ లో  బిజెపి గాని, దాని మిత్ర పక్షం భారత ధర్మ జనసేన గాని నామమాత్రమపు పార్టీలే. గత రెండు ఎన్నికల పరిస్థితి చూడండి బిజెపి ఎక్కడ ఉందో అర్థమవుతుంది.

2009,2014 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి షానవాస్ గెలిచారు. 2009 లో కాంగ్రెస్ పార్టీకి 49.86 శాతం (4,10,703 ) ఓట్లు పోలయ్యాయి. సిపిఐ అభ్యర్థి ఎం. రహంతుల్లాకు 31.23 శాతం (2,57,264) ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో ఎన్ సి పి కి 12 .10 శాతం (99,663) ఓట్లు వచ్చాయి. బిజెపిది 3.85 శాతం(31,687) ఓట్లతో నాలుగో స్థానం.

ఇక 2014 విషయానికొస్తే, షా నవాజ్ కు 41.20 శాతం (3,77,035)ఓట్లొచ్చాయి. సిపిఐ అభ్యర్థి సత్యన్ మోకేరీ కి 38.92 శాతం (3,56,165) ఓట్లొచ్చాయ్. బిజెపి కి 8.82 శాతం (80,752) ఓట్లతో మూడో స్థానం వచ్చింది.

ఇక్కడ క్లియర్ గా కాంగ్రెస్ ది బలమయిన స్థానం. అయితే,కాంగ్రెస్ క్రమంగా పట్టుకోల్పోతున్నాది. వామపక్షాల ఓట్లలో తేడా రాలేదు. కాంగ్రెస్ వోట్లు తగ్గాయి. ఆ నిష్పత్తిలో బిజెపి వోట్లు పెరిగాయి.

కేరళకు  వామపక్షాలు ఎపుడూ కాంగ్రెస్ కు మద్దతునిస్తూనే ఉన్నాయి. యుపిఎ-1 ప్రభుత్వంలో మన్మోహన్ ప్రభుత్వానికి మద్దతు నిచ్చాయి. 2008 జూలై లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకువచ్చిన యుఎస్ ఇండియా సివిల్ న్యూక్లియార్ డీల్ కు వ్యతిరేకంగా మాత్రమే వామపక్షాలు యుపిఎకి మద్దతు ఉపసంహరించుకున్నాయి.

ఈ విడాకులు రెండు పక్షాలను బాగా దెబ్బతీశాయి బిజెపి , మోదీ రావడానికి దోహదపడింది.

2004 నుంచి 2009 దాకా మన్మహన్ ప్రభుత్వం అనేక చారిత్రాత్మక చట్టా లు తీసుకు వచ్చింది. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం వగైరాలన్నీ పాస్ అయింది వామపక్షాల మద్దతుతోనే. 2009లో కాంగ్రెస్ నాయకత్వంలో యుపిఎ-2 అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వం మీద వామపక్షాల ప్రభావం ఏమీ లేదు కాబటి విశృంఖలంగా వ్యవహరించింది. అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. కాంగ్రెస్ పతనమయింది. పార్లమెంటులో వామపక్షాల సంఖ్య 60 నుంచి సింగిల్ డిజిట్ కు పడిపోయింది.

వామపక్షాల  పతనం కాంగ్రెస్ కు హాని చేస్తుందనే విషయం రాహుల్ గాంధీ గుర్తించడం లేదు. ప్రతిసారి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటంలో వామపక్షాల పాత్ర విస్మరించడానికి వీల్లేదు. హరికిషన్ సింగ్ సూర్జిత్ రోజుల నుంచి ఇప్పటిదాకా బిజెపికి ఎప్పటికపుడు అడ్డుకట్ట వేస్తూ కాంగ్రెస్ పతానాన్ని వామపక్షలు వాయిదావేస్తూ, ఆ పార్టీకి జీవం పోస్తూ వస్తున్నాయి. ఇపుడాయన వామపక్ష కూటమి బలంగా ఉన్న ఒకే ఒక రాష్ట్రంలో   బలహీనం పరిచేందుు ముందుకొచ్చారు. కేరళలో వామపక్షాలు బలహీనంగా బలపడేది బిజెపియే.

అందుకే కాంగ్రెస్ పార్టీ స్వయంగా వామపక్షాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించరాదు. ఇపుడు వయనాడ్ లో కాంగ్రెస్  చేస్తున్నదేమిటి? రాహుల్ గాంధీ వామపక్షాలను ఓడించి కాంగ్రెస్ కు ఓటేయమని అడగాల్సి వస్తున్నది. ఎందుకంటే, వయనాడ్ లో కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షం కమ్యూనిస్టులే. ఇదేదో స్థానిక కాంగ్రెస్ నాయకులయితే అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ హిమాలయాలనుంచి మోక్షం కోసం  స్వయాన రాహుల్ గాంధీ రావలసినంతటి నియోజకవర్గం కాదు వయనాడ్.

కేరళ కాంగ్రెస్ కమిటీ వయనాడ్ కు రమ్మని ఆహ్వనించినా దీని పర్యవసానాలేమిటి, వయనాడ్ లో తాను ఓడించాలనుకుంటున్నదెవరిననో  రాహుల్ గాంధీ ఆలోచించాల్సి ఉండింది.

రాహుల్ గాంధీ వయనాడ్ లో గెల్చి కాంగ్రెస్ కు అదనంగా తెచ్చేదేమీ లేదు, అదెలాగూ కాంగ్రెస్కు వచ్చేదే. కాంగ్రెస్ కు రాకపోతే, సైద్ధాంతికంగా తమకే మద్దతు నిచ్చే వామపక్షాలకు వచ్చేది.

ఇపుడు వయనాడ్ ల్ వామపక్ష అభ్యర్థి వోడిపోయి రాహుల్ గాంధీ గెలిస్తే, సంతోషించి పండగచేసుకునేది బిజెపియే. ఎందుకంటే, కేరళలో బిజెపి రావడనికి ప్రధాన అడ్ఢంకి వామపక్షాలే. ఇలాంటి వామపక్షాలను రాహుల్ గాంధీ సంహరిస్తే మోదీకి కంటే సంతోషించే వ్యక్తి ఎవరు?

అమెధీలో బిజెపి చేతిలో ఓటమి భయంతో రాహుల్ వయనాడ్ కు రాలేదని, దక్షిణాది మూడు రాష్ట్రాలు.. కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మీద ప్రభావం చూపేందుకే రాహుల్ ఇక్కడి వచ్చారని అనుకుందాం.

దీనికి వయనాడ్ సరైనది కాదని చాలా మంది అభిప్రాయం. వయనాడ్ మూడు దక్షిణాది రాష్ట్రాల కూడలికి సమీపంలోనే ఉన్నందునే ఆయన మూడు రాష్ట్రాలకు సన్నిహితంగా ఉండాలని వస్తున్నారని అనుకుందాం. అదే నిజమయితే,  అలాంటి నియోజకవర్గాలు తమిళనాడులో ఉన్నాయి, కేరళలలో ఉన్నాయి.

రాహుల్ వస్తానంటే డిఎంకె కాదనదు. కర్నాటక నుంచి పోటీ చేయాలని ఆయనకు కెపిసిపి ఎపుడో ఆహ్వానం పంపింది.

దేశానికి బిజెపితో, మోదీ తో ముప్పు ఉందని, ఆముప్పు ను తప్పించేందుకు ఏకైక జాతీయ పార్టీగా కాంగ్రెస్ కృషిచేస్తుందని అన్నపుడు కాంగ్రెస్ బిజెపి వ్యతిరేక పార్టీలతో సహకార దోరణితో వెళ్లాలి. సంఘర్ణణ దోరణి మంచిది కాదు. రాహుల్ వయనాడ్ వస్తున్నాడంటే చంకలేగరూసుకుని చప్పట్లు కొట్టింది కాంగ్రెసోల్లే తప్ప ప్రజాస్వామిక వాదులు కాదు. రాహుల్ వయనాడ్ కు రావడాన్ని సెక్యులర్ శక్తులు హర్షించడం లేదు.