నా బ్యాంక్‌ ఖాతా హ్యాక్‌ కాలేదన్న రేణూ…!?

తన బ్యాంకు ఖాతా ఏవిూ హ్యాక్‌ అవలేదని, తానే డొనేషన్‌ కోసం వివరాలు షేర్‌ చేశానని, సినీ నటి రేణు దేశాయ్‌ అన్నారు. జంతు సంరక్షణ కోసం రూ.3500 విరాళంగా ఇవ్వాలంటూ ఇన్‌స్టా వేదికగా ఆమె పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అయింది. దీంతో పలువురు నెటిజన్లు స్పందించారు. మరికొందరేమో, ఆమె బ్యాంకు ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్‌ చేసి, ఇలా డబ్బులు అడుగుతున్నారని సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పెట్టారు.

ఈ క్రమంలో రేణు దేశాయ్‌ వీడియో విడుదల చేశారు. తాను ఆ పోస్ట్‌ పెట్టడం వెనుక కారణాన్ని వివరించారు. ”అందరికీ నమస్కారం. కొన్ని రోజుల కిందట నాకు ఫుడ్‌ పాయిజన్‌ అయింది. హెల్త్‌ బాగోలేక వీడియోలు చేయడం లేదు. రూ.3500 కోసం రిక్వెస్ట్‌ నేనే పెట్టాను.. నా బ్యాంకు ఖాతా హ్యాక్‌ అవలేదు. విరాళం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. జంతు సంరక్షణ కోసం నేను రెగ్యులర్‌గా విరాళాలు ఇస్తూ ఉంటాను. దేనికి ఎంత విరాళం ఇవ్వాలనే దానిపై నెలవారీ నాకొక బడ్జెట్‌ ఉంటుంది. దాని ప్రకారం ఇస్తాను. నా దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఇచ్చేస్తే, నా కోసం, నా పిల్లలకు ఏవిూ మిగలదు. ఇంటి అవసరాలు చూసిన తర్వాత మిగిలితే, అప్పుడే విరాళాలు అందిస్తాను. విూరు నా సామాజిక మాధ్యమాలను ఫాలో అవుతుంటే విూకు ఆ విషయం తెలుస్తుంది.

గత రెండు, మూడు నెలలుగా మాత్రమే విరాళాలు ఇవ్వడం మొదలు పెట్టాను. ఆకలితో బాధపడే చిన్నారుల కోసం, సంరక్షణ అవసరమైన కుక్కలు, పిల్లులు, ఆవులకు సాయం చేస్తా. రాబోయే ఏడాదిన్నరలో షెల్టర్‌ కట్టేందుకు ప్రయత్నిస్తున్నా. అప్పుడు అధికారికంగా విూ నుంచి విరాళాలు అడుగుతాను. నా బ్యాంకు ఖాతా హ్యాక్‌ అయిందని విూరు కంగారు పడాల్సిన అవసరం లేదు. విూరు పంపిన డబ్బులు వచ్చాయి. ఆ మొత్తంతో ఏర్పాటు చేసిన ఆహారానికి సంబంధించిన వివరాలను త్వరలోనే పంచుకుంటా‘ అని రేణు దేశాయ్‌ అన్నారు.

గత కొన్ని రోజులుగా రేణు దేశాయ్‌ సోషల్‌ విూడియా నుంచి పెద్దగా అప్‌డేట్స్‌ లేవు. ఇదే సమయంలో రూ.3500 కావాలని కోరుతూ రేణు దేశాయ్‌ ఇన్‌స్టా ఖాతాలో ఓ మెసేజ్‌ పోస్టు అయ్యింది. క్యూఆర్‌ కోడ్‌ కూడా షేర్‌ చేశారు. ఈ పోస్టు చేసిన 5 నిమిషాల్లోనే కొంత మంది అభిమానులు స్పందించారు. వెంటనే డబ్బులు పంపారు. దీంతో ఈ అంశం వైరల్‌ అయింది.