కెమెరా కళ్లన్నీ ఐష్‌ వైపే… !?

అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఫ్రాన్స్‌లో జరిగే కేన్స్‌కు ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొని రెడ్‌ కార్పెట్‌పై సందడి చేస్తుంటారు. ఈ కేన్స్‌ వేడుకల్లో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. విభిన్న కాస్ట్యూమ్స్‌తో అలరిస్తుంటుంది. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు కొత్త కళ తెస్తుంటుంది ఐశ్వర్య. ఆమె రెడ్‌ కార్పెట్‌పై అలా నడుచుకూంటూ వస్తుంటే కెమెరా కళ్లన్నీ ఐష్‌ వైపే ఉంటాయి.

అయితే, ఈ సారి ఆమె గాయంతోనే కేన్స్‌లో పాల్గొనబోతోంది. గాయం కారణంగా చేతికి కట్టుతోనే కుమార్తెతో కలిసి ఐశ్వర్య ఫ్రాన్స్‌కు పయనమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఫ్రాన్స్‌ వేదికగా ఏటా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా జరుగుతుందన్న విషయం తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొని విభిన్న ఫ్యాషన్‌ దుస్తుల్లో రెడ్‌ కార్పెట్‌ పై హొయలుపోతుంటారు. బాలీవుడ్‌ నుంచి కూడా పలువురు తారలు హాజరై ట్రెండీ దుస్తులు ధరించి అందరినీ ఆకర్షిస్తుంటారు. ఇక ఏటా ఐశ్వర్య ఈ వేడుకలకు కచ్చితంగా హాజరవుతుంటుంది. కొత్త కొత్త కాస్ట్యూమ్స్‌ ధరించి తళుక్కున మెరిసి ఆకట్టుకుంటుంటుంది. అయితే, ఈ సారి ఆమె గాయంతోనే కేన్స్‌ వేడుకల్లో సందడి చేసేందుకు సిద్ధమైంది.