జగన్, షర్మిల, విజయమ్మ.. ఈ ముగ్గురిలో వైఎస్సార్ వారసత్వం ఎవరిది.?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి వుంటే, కాంగ్రెస్ పార్టీ మొహమ్మీద ఉమ్మేసేవారు.! ఈ మాటలన్నది ఎవరో కాదు స్వయానా వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల.! కానీ, అది ఒకప్పుడు. ఇప్పుడేమో, ‘కాంగ్రెస్ పార్టీ కోసమే జీవితమంతా త్యాగం చేశారు వైఎస్సార్. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం ఆయన కల. అందుకే, కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల నాకు ఆనందంగా వుంది..’ అంటూ షర్మిల కొత్త పల్లవి అందుకున్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వేరుపడి, కొత్త రాజకీయ కుంపటిని పెట్టుకున్న వైఎస్ జగన్, సుదీర్ఘ రాజకీయ పోరాటం తర్వాత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికార పీఠమెక్కారు. రెండోసారి ఏపీ ముఖ్యమంత్రి అవ్వాలనే కసితో వున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని కాలగర్భంలో కలిపేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుంది.

ఇక, వైఎస్ విజయమ్మ పరిస్థితి వేరు. తనయుడు వైఎస్ జగన్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారామె. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలిగానూ పని చేశారు. కానీ, అనూహ్యంగా ఆ పార్టీకి దూరమయ్యారు. కుమార్తె షర్మిల వెంట తెలంగాణ రాజకీయాల్లో సందడి చేశారు. నిజానికి, తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దూరంగా తెలంగాణలో విజయమ్మ తలదాచుకున్నారని చెప్పొచ్చేమో.!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ముగ్గురు వ్యక్తుల రాజకీయ ప్రయాణం మూడు రకాలుగా తయారైందిప్పుడు. షర్మిల కాంగ్రెస్‌లో కలిసిపోయారు. జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా వున్నారు. విజయమ్మ రాజకీయ ప్రయాణమే అయోమయంలో పడింది.

ఇంతకీ, వైఎస్సార్ వారసులు ఎవరు.? రాజకీయంగా అసలు సిసలు వారసత్వం ఎవరికి దక్కుతుంది.? ఈ చర్చ ఇప్పుడు వైఎస్సార్ అభిమానుల్లో జరుగుతోంది. మెజార్టీ అభిప్రాయం వైఎస్ జగన్ వైపే మొగ్గు చూపుతోంది. కానీ, ఇదో కష్టమైన సందర్భం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. చెల్లెలి రూపంలో రాజకీయ కత్తి మెడ మీద వేలాడుతోందిప్పుడు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.