ఏపీలో పోలింగ్ ముగిసింది.. ఫలితాలు జూన్ 4 ఉదయం నుంచి వెలువడనున్నాయి. ఈలోపు గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తపరుస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ విడుదలకు కూడా జూన్ 1 వరకూ అనుమతి లేకపోవడంతో.. ప్రస్తుతం ఎవరి ఊహాగాణాలు వారు బయటపెడుతున్నారు. ఈ సమయలో కాస్త కామ్ గా ఉన్నట్లు కనిపిస్తున్న ఏపీ రాజకీయాల్లో మీమర్స్ కి గ్యాప్ తీసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు నాగబాబు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును… పోలింగ్ రోజు రాత్రి మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. “మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే!” అని నాగబాబు ట్వీట్ చేశారు. దీంతో… ఇది అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశారంటూ నెట్టింట కొణిదెల వర్సెస్ అల్లు వార్ నడిచింది. మేటర్ సీరియస్ అయ్యిందనే కథనాలు వచ్చాయి!
ఈలోపు ఏమైందో ఏమో తెలియదు కానీ… అకౌంట్ ను డీ యాక్టివేట్ చేస్తూ నాగబాబు ఆన్ లైన్ లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ లోపు రకరకాల గాసిప్స్ తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఆన్ లైన్ లోకి వచ్చిన నాగబాబు… “నేను నా ట్విట్టర్ పోస్ట్ ను డిలీట్ చేశాను” అంటూ మరో ట్వీట్ చేశారు. దీంతో.. గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏఏ ఫ్యాన్స్ నాగబాబుపై సెటైర్ల వర్షం కురిపించారు.
అదంతా ఒకెత్తు అయితే తాజాగా నాగబాబు ఒక వీడియో సందేహం వదిలారు. ఈ వీడియోలో స్పైడర్ సినిమాలో విలన్ సూర్య క్యారెక్టర్ తో జగన్ ని పోల్చిన నాగబాబు… పోలింగ్ తర్వాత జరిగిన గొడవలు దానికి నిదర్శనం అని చెప్పుకున్నారు. ఆ సంగతి అలా ఉంటే… ఈ సందర్భంగంగా మరో కీలక వ్యాఖ్య చేశారు నగాబాబు. దీంతో నెటిజన్లు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. అసలు ఇంతజ్ఞానం ఎలా వచ్చిందనే సందేహాలు వ్యక్తపరుస్తున్నారని అంటున్నారు.
ఇంతకూ నాగబాబు ఏమన్నారంటే… “ఈవీఎం మిషన్లను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కేంద్ర ప్రభుత్వం వారి మూడంచెల సెక్యూరిటీ ఉంటుంది.. అయినప్పటికీ కూడా అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరం పహారా ఉండాలి.. ముఖ్యంగా మన వీర మహిళలు, జనసైనికులకు నా అభ్యర్థన ఏమిటంటే… జనసేన నేతలు పోటీచేసిన ప్రాంతాల్లోనీ ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంస్ వద్ద జనసైనికులు వాలంటీరింగ్ చేసి కాపలాగా కూర్చోవాలి” అని తెలిపారు.
దీంతో నెటిజన్లు నాగబాబుని ఒక ఆటాడేసుకుంటున్నారు. ఈవీఎం మిషన్లను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద జనసేన నాయకులు పహారా కాయాలని సూచించడం నాగబాబుకు మాత్రమే వచ్చే ఆలోచన అని, ఆయన ప్రత్యేక జ్ఞానం అని అంటున్నారు. ఈ సందర్భంగా వైసీపీ కేడర్ కూడా వచ్చి పహారా కాస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు? పహారా కాసే అవకాశమే ఉంటే.. ఆ హక్కు అందరికీ ఉంటుంది కదా అని గుర్తుచేస్తున్నారు.
మరోపక్క… అల్లు అర్జున్ పై ట్వీట్ జారిన నాగబాబు.. చివరకు ఆ ట్వీట్ డిలీట్ చేసి తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన క్రమంలో.. ఇలాంటి వీడియోలు చేసి, జగన్ పై ఘాటు విమర్శలు చేసి వ్యవహారాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నంగా చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ నేతల్ని రెచ్చగొట్టి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని సైలెంట్ చేద్దామనే ప్రయత్నం అని ఎద్దేవా చేస్తున్నారు. నెటిజన్లు మాత్రం వదలడం లేదు!