ఏబీవీపీ టు కాంగ్రెస్ సీఎం… రేవంత్ ప్రయాణం ఇదే!

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో ఏబీవీపీతో విద్యార్థి నాయకుడిగా మొదలైన రేవంత్ రెడ్డి ప్రయాణం నేడు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎంపిక అవ్వడం వరకూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఈ సందర్భంగా రేవంత్ ప్రయాణం ఎలా సాగిందనేది ఇప్పుడు చూద్దాం.

1989లో దోమలగూడ ఏవీ కళాశాలలో బీఏ-ఈపీపీ గ్రూప్‌ చేరిన రేవంత్ రెడ్డి ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడిగా విద్యారంగ సమస్యలపై పోరాటం చేశారు. అనంతరం వ్యక్తిగత జీవితంలో జరిగిన అనేక మలుపుల అనంతరం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. అనంతరం 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో (జెడ్.పీ.టీ.సీ) విజయం సాధించారు.

ఈ క్రమంలో 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా శాసనమండలికి ఎన్నికయ్యారు. అదే ఏడాది టీడీపీలో చేరిన ఆయన… ఆ పార్టీలో చంద్రబాబుకు నమ్మకస్తుడిగా, కీలక నేతగా ఎదిగారు. ఈ క్రమంలోనే 2009, 2014లో టీడీపీ టిక్కెట్‌ పై శాసనసభకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్స్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

అనంతరం ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరారు. ఈ సమయంలో 2019 ఎన్నికలలో మల్కాజిగిరి నుండి రెడ్డి లోక్‌ సభకు ఎన్నికయ్యారు. ఈ సమయంలో 2021 రేవంత్ పొలిటికల్ కెరీర్ లో బిగ్ టర్న్ మొదలైంది. ఇందులో భాగంగా… కాంగ్రెస్‌ లో చాలామంది సీనియర్లను కాదని.. జూనియర్‌ అయినప్పటికీ 2021లో పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఆ సమయంలో పార్టీ ఎన్నో ఎదురుదెబ్బలను ఎదుర్కొంటూనే ఉన్నప్పటికీ అధైర్యపడకుండా ముందుకు కదిలారు. ఇక ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో గెలుపొందడంతో.. ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. నాటినుంచి పార్టీలో కీలక చేరికలు మొదలయ్యాయి. దీంతో గ్రౌండ్ లెవెల్ లో పార్టీ మరింత బలపడటం మొదలుపెట్టింది.

ఇక తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడటంతో రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు వ్యూహాలకు తనదైన దూకుడు అందించారు. ఈ సమయంలో అధికార బీఆరెస్స్ పై నిప్పులు చెరిగారు. బీఆరెస్స్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అమలుచేస్తుందంటూ ఫైరయ్యారు. ఈ క్రమంలో అన్నీ అనుకూలంగా జరగడంతో తెలంగాణలో కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చింది. దీంతో… తాజాగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

సంవత్సరాల వారీగా రేవంత్ పొలిటికల్ ప్రస్థానం:

2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆరెస్స్)లో చేరిక

2006లో జెడ్.పీ.టీ.సీ. ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం

2008 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలుపు

2008లో తెలుగు దేశం పార్టీలో చేరిక

2009, 2014 ఎన్నికల్లో కొండంగల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం

2017లో టీడీపీకి రాజీనామా.. కాంగ్రెస్ పార్టీలో చేరిక

2019లో మల్కాజిగిరి ఎంపీగా గెలుపు

2021లో అనూహ్యంగా టీపీసీసీ చీఫ్ పదవి

2023లో కొండంగల్ ఎమ్మెల్యేగా విజయం… సీఎం పదవి!