కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ షర్మిల.! రాహుల్‌ని ప్రధానిగా చూడాలని.!

విలీనం పరిపూర్ణం.! కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం పూర్తయిపోయినట్లే. కాస్సేపటి క్రితం ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, వైఎస్ షర్మిలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తూ ఆమె మెడలో కాంగ్రెస్ పార్టీ కండువా వేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ భావి ప్రధానిగా చెప్పబడే రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన వైఎస్ షర్మిల, అంతకు ముందు వరకూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర పూరితంగా హత్య చేశారనీ, తనను కూడా అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారామె.

కానీ, ఆ తర్వాత ఆమె మనసు మార్చుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేశారనీ, ఆయనకు కాంగ్రెస్ పార్టీ సముచిత గౌరవం ఇచ్చిందనీ మాట మార్చారు వైఎస్ షర్మిల. తెలంగాణ రాజకీయాల్లో మనుగడ అసాధ్యమని తేలడంతోనే వైఎస్ షర్మిల ఇలా ప్లేటు ఫిరాయించాల్సి వచ్చింది.

కాగా, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుకున్నారనీ, ఆయన కలని నెరవేర్చడమే లక్ష్యంగా తాను కాంగ్రెస్ పార్టీలో పని చేస్తానని వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరాక వ్యాఖ్యానించారు. దేశంలోనే అతి పెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ అనీ, ఆ పార్టీలో చేరడం చాలా ఆనందంగా వుందని షర్మిల చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి.

మరోపక్క, రాజకీయంగా తమను వైఎస్ జగన్ దూరం పెట్టారనీ, అందుకే ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నామని షర్మిల భర్త అనిల్ వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై షర్మిల పోటీకి దిగుతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.