బిగ్ ఇష్యూ… కాంగ్రెస్ ఒకటి తలిస్తే షర్మిళ మరొకటి..!

ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవం కావడంతో ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసు వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. పైగా… దక్షిణాదిలో అటు కర్ణాటక, ఇటు తెలంగాణలో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూటమి “ఇండియా”లో తమిళనాడు నుంచి డీఎంకే ఉండనే ఉంది. ఇక దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని బలంగా భావిస్తుంది. ఈ సమయంలో అక్కడ వారికున్న ఆప్షన్ వైఎస్ షర్మిళ అనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది.

ప్రధానంగా తెలంగాణలో రాజన్న రాజ్యం అంటూ వైఎస్సార్టీపీని స్థాపించిన షర్మిళ.. అనూహ్యంగా ఎన్నికల్లో పోటీనుంచి తప్పుకున్నారు. బయట నుంచి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతా అనుకూలంగా జరగడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏఐసీసీ దృష్టంతా ఏపీవైపే ఉందని తెలుస్తుంది. ఈ సమయంలో ఏపీలో పూర్వ వైభవం రావాలని.. అందుకు షర్మిళ సేవలు వినియోగించుకోవాలని కాంగ్రెస్స్ అధిష్టాణం భావిస్తుంది.

ఇప్పటికే ఏపీలో ఘర్ వాపసీ సందేశాలు పంపింది కాంగ్రెస్స్ అధిష్టాణం. రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీవే అనే సంకేతాలు రాష్ట్ర నేతలకు పంపుతుంది. ఇదే సమయంలో కర్ణాటక, తెలంగాణల్లో కలిసొచ్చిన గ్యారెంటీల అమలుకు పథకాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో కాస్త ఫాలోయింగ్ ఉన్న క్యాండిడేట్ కోసం చూస్తున్న సమయంలో వారికి షర్మిళ మాత్రమే ఆప్షన్ గా కనిపిస్తున్నారని సమాచారం.

ఈ సమయంలో వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ తో ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో ఏపీలోనూ బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏపీ కాంగ్రెస్‌ సమన్వయ భేటీ జరిగింది.

ఈ సమావేశంలో.. రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌, మాణిక్కం ఠాగూర్‌, జేడీ శీలం, ఏపీ పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డితోపాటు పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా… ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం ప్రణాళికలు రచించారని అంటున్నారు. ఈ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిళకు ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించాలని భావించారని అంటున్నారు.

అయితే అందుకు వైఎస్ షర్మిళ ఏమాత్రం సానుకూలంగా లేరని అంటున్నారు. మొదటి నుంచీ తెలంగాణపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన షర్మిళ… తనకు ముందుగా ఏఐసీసీలో స్థానం కల్పించాలని కోరినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో వచ్చే ఏడాది మార్చిలో జరగబొయే రాజ్యసభ ఎన్నికల్లోనూ ఆమెకు సీటు కేటాయించాలని హామీ దక్కిందని సమాచారం. అయితే… ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలపై మాత్రం ఆమె సానుకూలంగా స్పందించడం లేదని అంటున్నారు.

ఈ సమయంలో షర్మిళ సేవలు ఎలాగైనా వినియోగించుకోవాలని బలంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ… ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ గా షర్మిళను నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏఐసీసీ మెంబర్ హోదాలో ఏపీ కాంగ్రెస్ అబ్జర్వర్ గా అయినా ఆమె సేవలు వినియోగించుకోవడం వల్ల… ఘర్ వాపసీ సక్సెస్ అవుతుందని కాంగ్రెస్ అధిష్టాణం బలంగా విశ్వసిస్తుందని సమాచారం. మరి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అంటే షర్మిళ రాజ్యసభ అంటున్నారని తెలుస్తున్న తరుణంలో… ఈ వ్యవహారం ఎలాంటి కన్ క్లూజన్ కి వస్తుందనేది వేచి చూడాలి!