‘‘నల్లగొండోళ్లను చూసి తెలంగాణ లీడర్లు కానీ, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఎన్నడు కన్నీటి చుక్క రాల్చలే.. కానీ వాజ్ పేయి కంటతడి పెట్టిండు. రొండు నిమిషాలే అపాయింట్ మెంట్ ఇచ్చిండు కానీ 32 నిమిషాలు మా మాటలు విన్నడు. సెక్యూరిటీ వాళ్లు టైం అయిపోయింది వెళ్లిపోండి అంటుంటే వాజ్ పేయి వారిని వారించిండు. సెక్యూరిటీ వాళ్లనే బయటకు పంపిండు. మేము నిలబడే ఉన్నం.. ఆయన నిలబడే ఉన్నడు… కుసోకుంటనే 32 నిమిషాలు మా ప్రసంగం విని వాజ్ పేయి కండ్లు చెమర్చిండు…’’
ఈ మాటలు అన్నది ఎవరంటే జల సాధన సమితి ఉద్యమ సృష్టికర్త దుశర్ల సత్యనారాయణ.
వాజ్ పేయి మనసున్న మారాజు అనడానికి ఇదొక ప్రత్యక్ష సంఘటన. నల్లగొండ జిల్లా వాళ్లను చూసి ఆయన కంటతడి పెట్టారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రలు కానీ, తెలంగాణ నేతలు కానీ ఏనాడూ నల్లగొండ బాధలు చూసి బాధపడ్డది లేదు. కానీ నల్లగొండ ఫ్లోరైడ్ నీటి కష్టాలు అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయినే కదిలించాయి. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల కంటే ఎక్కువగా నల్లగొండ ఢిల్లీకి పరిచయం అని నల్లగొండ జిల్లాలో ప్రచారంలో ఉన్నమాట. బాధతో ఢిల్లీని కదిలించిన నల్లగొండ పోరాటంతోనూ ఢిల్లీకి పరిచయమైంది. అనేక సందర్భాల్లో నల్లగొండలో జరిగిన పరిణామాలు ఢిల్లీని కదిలించాయి.
సొరంగం తొవ్వి పెట్టు… నల్లగొండకు బువ్వ పెట్టు అని జల సాధన సమితి చేసిన ఆందోళన ఢిల్లీని కదిలించింది. ఆ సమయంలో వచ్చిన ఎన్నికల్లో 682 నామినేషన్లు వేసి ఎన్నికల సంఘానికి సవాల్ విసిరారు. వాటిలో 482 నామినేషన్లు నిలబడ్డాయి. వారంతా పోటీలో ఉన్నారు. ఆ ఎన్నికలు జరపడం ఎన్నికల సంఘానికి కష్టసాధ్యమైంది. అప్పట్లో జల సాధన సమితి ఢిల్లీ ఎన్నికల సంఘానికి చెమటలు పట్టించింది. ఆ తర్వాతే ఎన్నికల నామినేసన్ ఫీజును గణనీయంగా పెంచారు. దానికి కారణం జల సాధన సమితి పోరాటమే.
2003లో జల సాధన ఉద్యమం నల్లగొండలో హోరుగా సాగుతున్న రోజులు. అప్పుడు నల్లగొండ ఫ్లోరైడ్ విముక్తి కోసం సొరంగం తొవ్వి పెట్టు, నల్లగొండకు బువ్వ పెట్టు అన్న స్లోగన్ తో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినయ్. జల సాధన సమితి ఆధ్వర్యంలో సుమారు 7 వందల మంది ఢిల్లీకి పోయారు. ఆ సమయంలో జల సాధన సమితి నాయకులు ముందుగా ముగ్గురు వ్యక్తులకు మాత్రమే రెండు నిమిషాల పాటు అప్పట ప్రధాని వాజ్ పేయ్ తో అపాయింట్ మెంట్ దొరికింది. ఇక ముగ్గురికి అన్నదగ్గర అప్పటి రైల్వే శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను పట్టుకుని 12 మంది ప్రధానమంత్రి వద్దకు వెళ్లారు. రెండు నిమిషాల టైం ఇస్తే 32 నిమిషాలు దుశర్ల సత్యనారాయణ కృష్ణమ్మ పరుగు వలే తెలంగాణ జనాల కష్టాలు ముఖ్యంగా నల్లగొండ ఫ్లోరైడ్ బాధలను వేగంగా వివరించారు. ప్రధాని వాజ్ పేయి ముందు అచేతనంగా పడి ఉన్న ఫ్లోరైడ్ పీడితుడిని, పక్కన నిలబడ్డ మరో బాధితుడిని చూసి, ఫ్లోరైడ్ బాధితుల ఫొటోలు చూసి, దుశ్చర్ల మాటలు విన్న తర్వాత వాజ్ పేయి ఏడుపు ఆపుకోలేకపోయారు.
వెంటనే నల్లగొండలో ఫ్లోరైడ్ రక్కసి నివారణకు ఏం చేయాలో అడిగారు వాజ్ పేయి. దుశర్ల కోరిక మేరకు 350 కోట్లను తక్షణం రిలీజ్ చేశారు ప్రధాని. మూసీ రివర్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు కు నిధులు మంజూరు చేశారు. అంతేకాకుండా కృష్ణా నీటిని పైపులైన్ల ద్వారా తరలించేందుకు అంగీకరించారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు కత్తి కట్టి నల్లగొండకు కృష్ణా నీళ్లు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని వాజ్ పేయికి వివరంగా చెప్పారు దుశర్ల. దానికి వాజ్ పేయి చలించిపోయారు. 700 మంది ఢిల్లీకి పోతే తిరుగు ప్రయాణంలో 500 మందికి తిరుగు ప్రయాణం కోసం ఉచితంగా రైలు టికెట్లు రిజర్వు చేసి పంపించారు. అసలే ఫ్లోరైడ్ బాధితులు కష్టాలు పడి వచ్చారు.. వారందరికీ ఉచితంగా రైలు టికెట్లు అందజేశారు. ఇది వాజ్ పేయి గొప్పతనం అని దుశర్ల సత్యనారాయణ ‘తెలుగు రాజ్యం’ తో ఆనాటి అనుభవాలను పంచుకున్నారు.
దుశర్ల సత్యనారాయణ వాజ్ పేయి తో జరిగిన మీటింగ్ తాలూకు పాయిట్ టు పాయింట్ ఆడియో ఇంటర్వ్యూ కింద ఉంది వినండి.