కేరళ బీభత్సం, ఆంధ్ర నేర్చుకోవలసిన పాఠాలు :ఇఎఎస్ శర్మ

 
 కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలరం చేసిన వర్షాలు వరదల నుంచి ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నేర్చుకోవలసి పాఠాలెన్నో ఉన్నాయని ప్రముఖ పర్యావరణవేత్త, మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ ఇఎఎస్ శర్మ చెబుతున్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక ఇమెయిల్ పంపించారు. ఈ మెయిల్ లో పర్యారవణానికి సంబంధించిన ఆసక్తి కరమయిన విషయాలెన్నింటినో ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన తెలుగులో పంపిన లేఖను యథాతథంగా ఇక్కడ అందిస్తున్నాం.
 
 
 
ఇ ఎ ఎస్ శర్మ 
14-40-4/1 గోఖలే రోడ్ 
మహారాణి పేట 
విశాఖపట్నం 530002
 
 
శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు 
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి 
అయ్యా,
 
గత కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రంలో జరుగుతున్న వరద భీభత్సం అనూహ్యంగా ఉంది. లక్షలాది మంది కుటుంబాలు వారి ఇళ్లను ఆస్తులను  పోగొట్టుకున్నారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించినా రాష్ట్ర ప్రభుత్వం వరద పరిణామాలను ఎదుర్కోలేక పోతున్నది.  
 
మీరు కేరళకు నగదు సహాయం ఇవ్వడం మెచ్చుకోవలసిన విషయం. 
 
కేరళలో ప్రకృతి విషమించడం వలన ఇటువంటి పరిస్థితి వచ్చింది అనడం కొంతవరకు నిజమే. కాని, ఇందుకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి అని గుర్తించాలి. 
 
కేరళలో మామూలు వర్షపాతం కన్నా ఈ సంవత్సరం వర్షాలు మూడింతలు పడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పుల వలన అకాల వర్ష పాతం కేరళలోనే కాకుండా దేశంలో ఇతర ప్రాంతాలలో కూడా వచ్చే అవకాశం రోజు రొజూ పెరుగుతున్నది. అటువంటి కుంభ వృష్టి ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి. 
 
ఉదాహరణకు, గత కొన్ని సంవత్సరాలుగా కేరళలో పశ్చిమ కనుముల కొండ చరియల మీద పెద్ద ఎత్తున కట్టడాలను, తవ్వకాలను ప్రభుత్వం అనుమతించింది. కేరళలో ఉన్న నదుల తీర ప్రాంతాలలో, మైదాన ప్రాంతాల బీల భూములలో, చెరువులలో  కూడా ప్రభుత్వం కట్టడాలకు అనుమతి ఇచ్చింది. ఇందువలన, వర్షాకాలంలో పడే మామూలు వర్షాల వలన పారే నీళ్లు కూడా గత కొన్ని సంవత్సరాలుగా జలపాతాలను సృష్టించి కేరళలో ప్రమాద పరిస్థితులను కలిగించిన విషయం అందరికీ తెలుసు. 
 
2011 లో కేంద్ర పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ పశ్చిమ కనుమలలో ఉన్న ప్రకృతి వనరులను  ఎలాగ పరిరక్షించాలి అనే విషయం మీద ఒక కమిటీని నియమించింది. ప్రొఫెస్సర్ మాధవ్ గాడ్గిల్ అనే సుప్రసిద్ధ పర్యావరణ వేత్త ఆధ్వర్యంలో ఆ కమిటీ ఎన్నో సలహాలను కేంద్రానికి, రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ ముఖ్యంగా పశ్చిమ కనుముల చరియలలో కట్టడాలను, మైనింగ్ కార్యకలాపాలను నిషేధించ వలసినది అని సూచించింది. అలాగే నదుల లో, నదుల తీర ప్రాంతాలలో, బీల భూములలో కూడా కట్టడాలమీద నియంత్రణ ఉండాలని సూచించింది. ఆ కమిటీ సూచనలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, పశ్చిమ కనుమల ప్రభావం పడే కేరళ వంటి రాష్ట్రాలు బుట్ట దాఖలా చేయడం శోచనీయం. ఈ రోజు కేరళలో మనం చూస్తున్న పరిస్థితి గాడ్గిల్ కమిటీ సూచనలను అమలు చేసిఉంటే ఇంత భీభత్సంగా ఉండేది కాదు. ఈ విషయం గాడ్గిల్ గారే స్వయంగా చెప్పారని తెలియపరిచిన ఒక రిపోర్టును జత పరుస్తున్నాను 
 
 
కేరళలో నెల్కొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, మనం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. 
 
  1. మనకు వచ్చే వర్షాలు తూర్పు కనుమలను తాకడం వలన, అక్కడి కొండ చరియలను కాపాడుకొనే విషయం మీద మనం తత్క్షణం దృష్టి సారించాలి. తూర్పు కనుమల వనరులను అధ్యయనం చేయడం కోసం గాడ్గిల్ కమిటీ వంటి కమిటీ ని నియమించాలి. ఈ విషయంలో ప్రభుత్వం మాధవ్ గాడ్గిల్ గారితో సంప్రదించాలి. 
  2. పశ్చిమ కనుమల విషయంలో గాడ్గిల్ కమిటీ చేసిన సలహాలను దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, మన ప్రాంతంలో కొండ చరియల మీద మైనింగ్ కార్య కలాపాలను, కట్టడాలను నిషేధించాలి. నదులలో కట్టడాలను, నదులలో ఇసుక త్రవ్వకాలను, నదుల, వాగుల తీర  ప్రాంతాలలో, బిలలలో  కట్టడాలను నియంత్రించాలి. 
  3. హుద్ హుద్ వంటి గాలి వానల భీభత్సాన్ని తట్టుకోవడానికి, తీర ప్రాంతాలలో మడ అడవుల పరిరక్షణ వంటి పథకాలను పెద్ద ఎత్తున చేపట్టాలి.  
  4. ముఖ్యంగా తీర ప్రాతాల పరిరక్షణకు దోహదం చేసే CRZ నోటిఫికేషన్ ను ప్రభుత్వ సంస్థలు గౌరవించి నూటికి నూరు పాళ్ళు అమలు చేయాలి. 

 

కేరళ లో జరుగుతున్న ప్రకృతి భీభత్సం నుంచి నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం: 
 
“ప్రకృతి తో చెలగాటం ఆడితే, ప్రకృతి సహించదు”
 
కేరళలో జరుగుతున్న ప్రకృతి వైపరీత్యం మన రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. అటువంటి వైపరీత్యాలను ఎదుర్కొనడానికి ప్రభుత్వం ఇటువంటి ముందు చర్యలు తీసుకొంటారని ఆశిస్తున్నాను. 
 
ఇట్లు 
 
ఈ అ స శర్మ 
విశాఖపట్నం 
19-8-2018