సీమ ప్రజలపై నిందలేయడం హీరోయిజమా పవనన్నా…

(అభిప్రాయం)

జగన్ భీమవరంకి పులివెందుల మనుషులను పంపుతారా ?

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోకి పులివెందుల అల్లరిముకలు ప్రవేశిస్తే తరిమికొట్టతాను అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడటం అత్యం అభ్యంతరకరమే కాదు రాయలసీమ ప్రజలను అవమానించడం కూడాను.

అమరావతి రాజధాని అయినా నామనసులో మాత్రం కర్నూల్ రాజధాని అంటూ మీరు చేసిన ప్రకటన రాయలసీమ ప్రజలలో కొత్త ఆశలు చిగురించాయి. అలాంటి పవన్ కళ్యాణ్ భీమవరంలో సీమ ప్రజలను కించ పరిచేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరం.

విశాఖలో తల్లికోసం జగన్ ఫ్యాక్షన్ చేసినాడా పవన్?

2014 ఎన్నికల్లో జగన్ తన తల్లి విజయమ్మను విశాఖ పార్లమెంట్ స్థానంలో పోటీకి పెట్టారు. నాడు కూడా ఇలాంటి విమర్శలు  చేసినారు. విజయమ్మ గెలిస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని , పులివెందుల గుండాలు అశాంతిని కలిగిస్తారని ప్రచారం చేశారు. ప్రజలు కూడా నమ్మారు పలితం విజయమ్మ ఓడిపోయారు.

ఇక్కడ గుర్తించుకోవలసింది తన తల్లి స్వయంగా పోటీ చేసినా జగన్ తను పుట్టిన ప్రాంతం, మీరు విమర్శిస్తున్న పులివెందుల మనుషులను పంపారా లేదే. నాటి ఎన్నికల్లో విశాఖలో ఒక్క హింసాత్మక సంఘటన చోటుచేసుకోలేదు. తన తల్లి కోసం ఫ్యాక్షన్ చేయని జగన్ తనకు పోటీ కానీ మిమ్మల్ని ఓడించడానికి పులివెందుల మనుషులను పంపుతారా? పవన్ ఒకేసారి ఆలోచించండి.

నేటి విశాఖ నగరంలో ఆగడాలకు కారణం ఎవరు?

నేడు విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఎలా అవుతున్నాయో రిటైర్డు ఐఎ ఎస్ అధికారి ఇఎ ఎస్ శర్మ వందల లేఖలు  రాశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి. శాంతి భద్రతలు సరిగా లేదని మీరే అనేక సార్లు విమర్శలు చేసినారు. ఆందోళన కూడా చేసినారు.

ఏ పులివెందుల గుండాలు అందుకు కారణమో చెప్పగలరా?

ఈ మొత్తం వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంది మీరు పెంచి పోసించిన వారు కాదూ?. అదే పులివెందుల ప్రాంతం నుంచి ఎన్నికైన వై యస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే కదా విశాఖపట్నం గ్రేటర్ అయినది. నాటి పాలనలో నేటి పరిణామాలు చోటు చేసుకున్నాయా పవన్ సమాధానం చెప్పాలి.

నిందలు వేయడం హీరోయిజం కాదు

వ్యక్తిగతంగా సినీ హీరో అయిన పవన్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హీరోయిజం అంటే ఇతరులపై నిందలు వేయడం కాదు. తన వారికి , తన చుట్టూ ఉన్న వారికి మేలు చేసి అభిమానం పొందడం. కానీ పవన్ అందుకు భిన్నంగా జగన్ మీదా రాయలసీమ ప్రజల మీదా నిందలు వేయడం ద్వారా విజయం సాధించాలనుకుంటున్నారు.

2014 లో తన మద్దతుతో అధికారంలోకి వచ్చిన బాబు ప్రభుత్వంతో దాదాపు నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నపుడు భీమవరంకి ఏమి చేసినారు , విడిపోయిన తర్వాత ఏ సమస్య పరిష్కారానికి పోరాటం చేసినారు , తనను గెలిపిస్తే భీమవరం నియోజకవర్గ ప్రజలకు ఏమి చేస్తారు చెప్పి అక్కడ ప్రజల మద్దతు పొందవచ్చు.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏ సంబంధం లేని పులివెందుల ప్రజలపై నిందలు వేసి రాజకీయం చేయాలనుకుంటున్నారు అంటే ఇతరుల మీద నెపం మోపి తాను హీరో కావాలనుకుంటే అంతకన్నా దుర్మార్గం మరోటి ఉండదు. తనకు , తన కుటుంబానికి పెద్ద దిక్కు అయిన మెగాస్టార్ చిరంజీవిని మీ స్వంత ప్రాంతం ప్రజలు ఓడిస్తే రాయలసీమ ప్రజలు తిరుపతి నుంచి గెలిపించి మీకు రాజకీయ బిచ్చ పెట్టారు. అలాంటి ప్రాంతంపైనా మీరు నిందలు వేసేది.

జగన్ రాజకీయాలుపై ఏ విమర్శలు చేసినా మాకు అభ్యంతరం లేదు. జగన్ పై కోపంతో వారు పుట్టిన రాయలసీమ ప్రజలపై నిందలు వేయడాన్ని సీమ సమాజం అంగీకరించదు. తమకు ఏమి చేశారు , ఏమి చేయబోతున్నారో చెప్పకుండా రాయలసీమ ప్రజలపై విషం చిమ్మితే విజ్ణత కలిగిన భీమవరం ప్రజలు కూడా హర్షించరు అని పవన్ కళ్యాణ్ గారు గుర్తించితే వారికే మంచిది.

-యం. పురుషోత్తమ రెడ్డి
రాయలసీమ మేధావుల ఫోరం
తిరుపతి.