చంద్రబాబు అసహనం.. దేనికి సంకేతం….

(మల్యాల పళ్లంరాజు)

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్నట్లు కన్పిస్తోంది. రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీకి మెజారిటీ వస్తుందని కొన్ని సర్వేల నివేదికలు వచ్చినప్పటి నుంచి ఆయనలో  తీవ్ర ఆందోళన, అసహనం వ్యక్తమవుతోంది. విశాఖ విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి అనంతరం జరిగిన పరిణామాలు, దాడిని ఖండించకపోగా, ఆ దాడి ఓ నాటకమని చిత్రీకరించేందుకు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు.. గవర్నర్ ఈ అంశంపై డిజీపీతో ఫోన్ లో మాట్లాడడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం ఆయన మానసిక పరమైన ఆందోళనకు అద్దం పడుతున్నాయి.  

 

అటు తెలంగాణ ఇటు ఆంధ్రలోని నాయకులు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కొందరు కాంగ్రెస్ నాయకులు జగన్ పై దాడిని ఖండించడాన్ని కూడా చంద్రబాబు జీర్ణించుకోలేక పోయారు. ఏపీలోను, ఢిల్లీ లో నేషనల్ మీడియా సమావేశంలోనూ పూర్తి అసహనంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం తెలుగుదేశం పార్టీ వర్గాలనే నివ్వెర పరచింది.

జగన్ పై దాడిని బీజేపీ, టీఆర్ ఎస్, పవన్ కల్యాణ్, ఇతర పార్టీలు ఖండించడం పట్ల తనకు అభ్యంతరం లేదని చెబుతూనే, తనపై పలువురు పలు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆ దాడి జరిగింది ఎయిర్‌పోర్టులోకాబట్టి అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యంకిందికి వస్తుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల వైఫల్యం లోకి రాదని చెబుతూనే, కేంద్ర విమానయానశాఖ,  ఎయిర్ పోర్ట్ అథారిటీ, తమ పనితీరును వాళ్లు సమీక్షించుకోవాలని ఓ హెచ్చరిక చేశారు. అయితే ఈ ఘటనలో తమ పోలీసు ఉన్నతాధికారులు, పార్టీ మంత్రులు, కార్యకర్తలు చేసిన వీరంగాన్ని ప్రస్తావించక పోవడం విశేషం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్  జగన్ ఉదంతంపై డిజీపీకి ఫోన్ చేయడాన్ని చంద్రబాబు రాజకీయంగా చూడడం, తనకు వ్యతిరేకంగా ఢిల్లీ పెద్దలకు ముఖ్యంగా మోదీకి నివేదికలు పంపుతున్నారన్న అనుమానం గవర్నర్ పట్ల తీవ్ర వ్యాఖ్యలకు దారితీశాయి. గవర్నర్ కేసీఆర్ ను మెచ్చుకోవడం, అభిమానించడం, జగన్, పవన్ పట్ల కూడా సానుకూల ధోరణితో వ్యవహరించడం చంద్రబాబు ఆగ్రహానికి కారణంగా కన్పిస్తోంది. అంతే కాదు. ఈ మధ్య అటు ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇటు తెలంగాణలోనూ ఐటీ దాడులు జరుగుతున్నాయి. తెలంగాణలో మాజీ టీడీపీ నాయకులు విజయరామారావు కొడుకు, రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లో సుజనా చౌదరీ, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ,  సీఎం రమేశ్ తో పాటు నవయుగ ప్లస్, పోలవరం పనులు చేస్తున్న పలు కంపెనీల పై ఐటీ దాడులు, అక్రమాలు వెలుగులోకి రావడం కూడా పెద్దాయన ఆగ్రహానికి కారణం. వీరిలో పలువురు చంద్రబాబు బినామీలనే ప్రచారం ఉంది. దీంతో.. ఈ ఐటీ దాడులను ఏకంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ పై జరుగుతున్న దాడులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ కుట్రపూరితంగానే ఐటీ దాడులు చేయిస్తున్నారనీ, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారనీ ఆరోపిస్తున్నారు. అవినీతి ఏ మేరకు జరిగిందో తెలుసుకనుక, దాడులు జరుగుతాయని ముందే ఊహించి అవసరమైన ఈ నేపథ్యాన్ని సృష్టించారు.

 

జగన్ పై దాడిని సాకుగా చూపి తమ సర్కార్ ను కేంద్ర ప్రభుత్వం అస్థిరపాలు చేయాలని చూస్తోందని మోడీ లక్ష్యంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. కేంద్రంలో మోడీ సర్కార్, గవర్నర్, జగన్ పార్టీలు కుమ్మక్కయి, దాడి అంశాన్ని పెద్దగా చిత్రీకరించి, తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు,రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు పన్నాగాలు పన్నుతున్నాయనే అనుమానాలు ప్రచారం చేస్తున్నారు. గతంలో టీడీపీ తమతో తెగతెంపులు చేసుకునే అవకాశం ఇచ్చి కొంత తప్పు చేశామని పరోక్షంగా పశ్చాత్తాపపడిన మోడీ సర్కార్ చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాలు దాదాపు శూన్యమే.

  ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టం కింద జరిగిన అన్యాయాన్నిప్రతిపక్షాల ముఖ్యనాయకులను కలిసి, ఏకరువు పెట్టడం, తమ ప్రభుత్వం ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తేటతెల్లం చేసే యత్నాలు ఢిల్లీ లో చంద్రబాబు పర్యటనలో కీలక అంశాలు.

 

ఆంధ్రప్రదేశ్ లో నాలుగున్నర ఏళ్లుగా ప్రాజెక్టుల పనులు  ఏ విధంగా జరుగుతున్నాయో, అంచనాలను ఏమే రకు విచ్చలవిడిగా సవరిస్తున్నారో, కాంట్రాక్టులు టెండర్లు ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిన ఎవరెవరికి కట్టపెడుతున్నారో ప్రజలకు చూచాయిగా నైనా తెలియక పోదు. పాత కాంట్రాక్టర్లపై 60 సి నిబంధనలు ప్రయోగించి వేటువేయడం, మిగిలిన పనుల వ్యయం అంచనాలను పెంచి సీఎం రమేశ్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ కు అప్పగించడం ఓ పద్ధతి ప్రకారం సాగింది. మొత్తం రూ. 3,858 కోట్ల విలువైన పనులను ఈ సంస్థకు ఇచ్చారు.  హంద్రీ నీవా, గాలేరు ప్రాజెక్టులలోనే అంచనాలను విపరీతంగా పెంచి నామినేషన్ పద్ధతిన రూ. 1,156 కోట్ల విలువైన పనులు, రమేశ్ కు అప్పగించారు. తిరుపతి దగ్గరలో 300 ఎకరాల గుడిమాన్యం తక్కువ ధరకు ఇప్పించిన విషయం, ఆ భూమిని తనఖా పెట్టి బ్యాంకు రుణంతో రిత్విక్ కంపెనీని ఎలా పెట్టించారో తెలుగుదేశం లో బహిరంగ రహస్యమే. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు రాయలసీమలో రమేశ్, కోస్తాంధ్రలో నారాయణ,తెలంగాణలో సుజనా చౌదరీ ఏ విధంగా ఆర్థిక సహాయం చేశారో పార్టీలో ఎవరిని అడిగినా చెబుతారు.  అటువంటి వారిపై ఐటీ తనిఖీలు చేసినప్పుడు వ్యాపార రాజకీయవాదులను ఏపీ సర్కార్ వెనకేసుకు రావడాన్ని ప్రజలు మెచ్చుకుంటారా. ఐటీ దాడులను ఆంధ్రులపై దాడిగా అభివర్ణించడం గౌరవమా రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా చేసేందుకే ఐటీ దాడులు చేస్తున్నారన్న వాదనను ఎవరైనా సమర్థిస్తారా అన్నది కోటి డాలర్ల ప్రశ్న.

 

కాదేదీ.. రాజకీయాలకు అనర్హం… అన్నట్లు గత కొద్ది కాలంగా తనకు సంబంధించిన అన్ని అంశాలను రాజకీయం చేేసేందుకు, ముఖ్యంగా ఢిల్లీ సర్కార్ పై దుమ్మెత్తి పోసేందుకు నారా చంద్రబాబు నాయుడు యత్నిస్తున్నారు.  సమస్యలను వక్రీకరించి, ఉద్దేశ పూర్వకంగా తన రాజకీయ లబ్ధి కోసం వాడుకునేంతగా దిగజారిపోయినట్లు కన్పిస్తోంది. ఇవి హాస్యాస్పదంగా ఉన్నాయని కూడా ఆయన గుర్తించకపోవడం గమనార్హం. 2015 జూలై 15న గోదావరి పుష్కరాల ప్రారంభ ఘటనలో 29 మంది చనిపోతే, దానిని ఓ ఈవెంట్ గా మార్చేయాలని చూశారు చంద్రబాబు.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రతి పక్ష నాయకుడుగా ఉన్నప్పుడు బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలో భాగంగా అనుమతి లేకుండా మహారాష్ట్ర భూభాగంలో ప్రవేశించినందుకు పెట్టిన కేసులో రెండేళ్లుగా 32 సార్లు సమన్లు వచ్చినా కోర్టుకు హాజరు కాలేదు. ఆ కేసులోనే మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే.. దానినీ ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ సర్కార్  చేస్తున్న కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తనను జైలులో పెట్టేందుకు మోడీ సర్కార్, మహారాష్ట్రలో ఫద్వవీస్ సర్కార్ యత్నిస్తున్నట్లుగా భూతద్దంలో చూపే యత్నం చేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్ అన్నది సర్వ సాధారణం. పత్రికల్లో తరచు వచ్చే కేసులు , ఆ కేసుల్లో పత్రికాధిపతులకు, ఎడిటర్లకూ ఇలాంటివి రావడం, లాయర్ తో సహా కోర్టుకు హాజరయితే ఆ వారెంట్ బుట్టదాఖలు అవుతుంది. అలాంటి ఎన్ బీడబ్ల్యూను తన ప్రచారానికి వాడుకున్న ఘనుడు నారా చంద్రబాబు. ఇప్పుడు ఐటీ దాడులను,  తాజాగా జగన్ పై జరిగిన దాడి విషయాన్నీ కూడా తనకు అనుకూలంగా మలచు కునేందుకు నారావారు తంటాలు పడుతుంటే.. ఎన్నికలకు ఆరు నెలల ముందే ఓటమి భయం పట్టుకుందేమో నన్న సందేహం కలుగుతోంది.

 

(మల్యాల పళ్లం రాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్. ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)