ఒక ఖైదీ, 19 రుగ్మతలు, అయినా కదలిక లేని ప్రభుత్వాలు, ఆయన ఆరోగ్యం గురించి భార్య వసంతకుమారి ఆవేదన
నాగపూర్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న తన కుమారుడిని హైదరాబాద్ సెంట్రల్ జైలుకు బదిలీ చేయాలని కోరుతూ ప్రొఫెసర్ సాయిబాబా తల్లి 2017 నవంబర్ 16న మహారాష్ట్ర గవర్నర్‌కు ఒక లేఖ రాశారు. 2017 డిసెంబర్ 11న, 23న, 2018 ఫిబ్రవరి 2న, దిగజారుతున్న సాయిబాబా ఆరోగ్య పరిస్థితి గురించి మహారాష్ట్ర గవర్నర్‌కు నేను సమాచారాన్ని ఇచ్చాను.
ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా ఆరోగ్యం ఆందోళనకరంగా దిగజారిపోతోంది. సుదీర్ఘకాలం జైలులో మగ్గిపోయినందున ఆయన 19 రుగ్మతలతో బాధపడుతున్నారు. 16 నెలల కాలంలో దాదాపు 45 సార్లు ఆయన్ని నాగపూర్ వైద్యకళాశాల ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు గానీ ఇంతవరకు ఎటువంటి చికిత్స జరపలేదు. తీవ్ర ఆరోగ్య సమస్యలను సైతం ఇంకా పట్టించుకోనే లేదు. గుండె సమస్య, హైపర్ టెన్షన్ (అధిక రక్తపీడనం), పొట్టలో ఎడమవైపు పెరుగుతున్న గడ్డ కారణంగా తీవ్ర స్థాయిలో కలుగుతున్న బాధ ఇత్యాది రోగాలపై ఇంతవరకు సరైన డాక్టర్లు తమ దృష్టి పెట్టనే లేదు. సాయిబాబా రక్త విరేచనాలతో బాధపడుతున్నారు గత కొద్ది నెలలుగా మూత్రంలో రక్తం అధిక పరిమాణంలో వస్తోంది.
ఈ సమస్యలన్నీ పరస్పర సంబంధమున్నవే. వాటిని పరీక్షించి, తగు చికిత్స అందజెయ్యడానికి సుదీర్ఘ కాలం పడుతుంది. గత పర్యాయం జైలులో ఉన్నప్పుడు సాయిబాబాను నాగపూర్‌లోని ప్రభుత్వ వైద్యకళాశాల (జిఎమ్‌సిహెచ్) ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. సాయిబాబాకు చేయవలసిన చికిత్సలకు అవసరమైన సదుపాయాలు తమ ఆస్పత్రిలో పూర్తిగా లేవని, ప్రత్యేక సదుపాయాలున్న ఆస్పత్రికి ఆయన్ని పంపించాలని జిహెచ్‌ఎమ్‌సి డాక్టర్లు కోర్టుకు నివేదించారు. వికలాంగులకు ప్రత్యేక, ఉన్నత స్థాయి చికిత్సలు నిర్వహించే నిపుణులు తమ ఆస్పత్రిలో లేరని కూడా కోర్టుకు తెలియజేశారు.
సాయిబాబా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని న్యాయవాదుల నుంచి అందుకున్న తరువాత గత ఏప్రిల్ 2న నేను నాగపూర్‌కు వెళ్ళాను. సాయిబాబాకు రోగ నిదాన పరీక్షలు నిర్వహించి, చికిత్స చేసేందుకు ఆయన్ని నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి జిహెచ్‌ఎమ్‌సికి మార్చే అవకాశమున్నట్టు నాకు అప్పటికే తెలిసింది. అయితే ఆసుపత్రిలో సాయిబాబాను కలవడానికి గానీ, ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్‌తో సమావేశమవడానికి గానీ నన్ను అనుమతించలేదు. ఆ రోజు సాయంత్రం ఆసుపత్రి నుంచి సాయిబాబాను మళ్ళీ జైలుకు తీసుకువెళ్ళుతున్న సమయంలో నేను ఆయనతో మాట్లాడడానికి పోలీసు అధికారులు అనుమతించలేదు. అనుమతించకపోవడమే కాదు, సాయిబాబాకు సమీపంగా వెళ్ళడానికి ప్రయత్నించిన నన్ను మహిళా కానిస్టేబుల్స్ బలవంతంగా వెనక్కి తోసేశారు.
ఇటువంటి ప్రాతికూల్యాలు, నా భర్తకు అత్యవసరంగా జరగవలసిన చికిత్సలపై డాక్టర్ల పూర్తి నిర్లక్ష్యం మమ్ములను అమితంగా బాధించాయి. ఈ కారణంగా నా భర్త, మా కుటుంబ సభ్యులు 2017 ఆగస్టులో నాగపూర్ జైలు నుంచి హైదరాబాద్‌లోని చర్లపల్లి సెంట్రల్ జైలుకు బదిలీ చేయాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్‌లోని సెంట్రల్ జైలుకు తనను బదిలీ చేయాలని కోరుతూ ప్రొఫెసర్ సాయిబాబా 2017 ఆగస్టు 23న మహారాష్ట్ర ఐజి (జైళ్ళు)కి ఒక లేఖ రాశారు. అంతకుముందు అంటే 2017 జూన్‌లో ప్రొఫెసర్ జి.హరగోపాల్ (చైర్‌పర్సన్, కమిటీ ఫర్ ది రిలీజ్ అండ్ డిఫెన్స్ ఆన్ డాక్టర్ జి.ఎన్.సాయిబాబా) మహారాష్ట్ర గవర్నర్‌కు, సాయిబాబాను హైదరాబాద్ సెంట్రల్ జైలుకు బదిలీ చేయాలని మౌఖికంగా విజ్ఞప్తి చేశారు.
2017 నవంబర్ 16న సాయిబాబా తల్లి కూడా మహారాష్ట్ర గవర్నర్‌కు తన కుమారుడిని నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి బదిలీ చేయాలని కోరుతూ ఒక లేఖ రాశారు. 2017 డిసెంబర్ 11న, 23న, 2018 ఫిబ్రవరి 2న, దిగజారుతున్న సాయిబాబా ఆరోగ్య పరిస్థితి గురించి తాజా సమాచారాన్ని గౌరవనీయ మహారాష్ట్ర గవర్నర్‌కు ఇచ్చాను. తెలంగాణ డిజిపి (జైళ్ళు) వి.కె.సింగ్‌ను కూడా కలిసి 1950 కేంద్ర చట్టం నిబంధనలు, కొన్ని సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం సాయిబాబాను తెలంగాణకు తీసుకురావాలని కోరాను. తెలంగాణ డిజిపి మహేంద్ర రెడ్డిని కూడాకలిసి సాయిబాబా బదిలీకి ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్ ఇవ్వాలని అభ్యర్థించాం. వృద్ధురాలైన తల్లి, తమ్ముడి కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తున్నందున సాయిబాబాను హైదరాబాద్ సెంట్రల్ జైలుకు తీసుకురావాలని కోరాము.
వైద్య కారణాల ఆధారంగా సాయిబాబాకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మేము అప్పటికే దరఖాస్తు దాఖలు చేశాము. అయితే మహారాష్ట్ర పోలీసులు మా బెయిల్ దరఖాస్తుపై విచారణకు పదేపదే వాయిదాలు కోరుతూ వచ్చారు. సాయిబాబా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందని తెలిసి కూడా వారు ఆ విధంగా వ్యవహరించారు.
సాయిబాబాకు చేయవలసిన చికిత్స అతని పిత్తాశయానికి శస్త్ర చికిత్స నిర్వహించడం మాత్రమేనని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. అయితే మేము పదే పదే వారి దృష్టికి తీసుకువస్తున్న ఇతర రుగ్మతల గురించి పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. వాటి విషయమై వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు సాయిబాబా పిత్తాశయంలోని రాళ్ళను తొలగించడానికి శస్త్ర చికిత్స నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నారు. శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తి సర్జరీ అనంతరం చాలా జాగ్రత్తలు తీసుకోవల్సివుంటుందని మరి చెప్పనవసరం లేదు. నా భర్త విషయానికి వస్తే తప్పనిసరిగా అనేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే టాయ్‌లెట్ ఉపయోగించుకోవడానికి సైతం సరైన సహాయం, మద్దతు లేకుండా ఆయన వీల్ చైర్‌ను వదిలి వెళ్ళలేరు. ఒకసారి శస్త్ర చికిత్స జరిగిన తరువాత, ఆయన తన రోజువారీ పనులు నిర్వహించుకోవడం మరీ భారమైపోతుంది. ఆసుపత్రిలో ఉన్నప్పుడేకాక, జైలుకువెళ్ళిన తరువాత కూడా తన పనులు తాను చేసుకోవడం అసాధ్యమైపోతుంది. కుటుంబ సభ్యురాలిగా జైలులో ఉండే ఆరోగ్య రక్షణ పరిస్థితుల గురించి నేను బాగా కలత చెందుతున్నాను. అందునా శస్త్ర చికిత్స చేయించుకున్న వ్యక్తులకు అవి ఏమాత్రం అనుకూలంగా ఉండవు.
శస్త్ర చికిత్స మాత్రమే సాయిబాబాకు స్వస్థతనివ్వదు. ఎందుకంటే ఆయన ఇంకా చాలా జబ్బులతో బాధపడుతున్నారు పిత్తాశయంలోని రాళ్ళను తొలగించడానికి మాత్రమే శస్త్ర చికిత్స జరిగితే, ఆ తరువాత పొట్టలో పెరుగుతున్న గడ్డను తొలగించడానికి మరో శస్త్ర చికిత్స జరగవలసి అవసరమున్నది.
బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడల్లా రెండురోజులు ముందే ఆయన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళుతున్నారు. ఆరోగ్య పరిస్థితులు, చికిత్స వివరాలు తెలుపడానికి మరింత వ్యవధి కావాలని ప్రాసిక్యూషన్ అడగడం పరిపాటి అయిపోయింది. ఈనెల 9న నాగపూర్ హైకోర్టుబెంచ్ ఎదుట బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలోనూ వైద్య పరీక్షలకోసం ముందుగానే జిఎమ్‌సిహెచ్‌కు తీసుకువెళ్ళారు.
జైలుకు వెళ్ళిన తరువాత సాయిబాబా మొత్తం 11 సార్లు స్పృహ తప్పిపడిపోయారు. అయితే జిఎమ్‌సిహెచ్ తన నివేదికలో కేవలం 3 సార్లు అని మాత్రమే పేర్కొంది. కేవలం ఏడాదిన్నరలో ఆయన 12 కిలోల మేరకు బరువు తగ్గారు. చాలా బలహీనపడిపోయారు. సరైన, సంపూర్ణ వైద్య చికిత్స జరగనిదే సాయిబాబా మరెంతోకాలం సజీవుడుగా ఉండలేరు.
ఎ.ఎస్. వసంత కుమారి
(జి.ఎన్. సాయిబాబా భార్య)