కొన్ని రోజులుగా తెలుగు రాష్ర్టాల్లో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతాల్లో మావోల కదలికలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్న మావోయిస్టులు ఇప్పుడు మళ్లీ హల్చల్ చేయడంపై తెలుగు రాష్ర్టాల్లో ఆసక్తి నెలకొంది. వరంగల్లు, ఖమ్మం, విశాఖ ఏవోబీ సరిహద్దులో జోరుగా మావోయిస్టుల సమావేశాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ర్టాల ప్రభుత్వాలు మావోల ప్రభావిత ప్రాంతలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసాయి. పోలీసు బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణలో మావోయిస్టులు ఈనెల 25న బంద్ కు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేసారు. భీమా కోరెగావ్ ఘటనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కోంటున్న కవి వరవరరావును వెంటనే విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేసారు. అలాగే అటవీ ప్రాంతం నుంచి గ్రేహౌండ్స్ సిబ్బంది వెనక్కి వెళ్లిపోవాలని పేర్కొన్నారు. రాజకీయ ఖైదీలను, 60 ఏళ్ల వయసు పైబడిన ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఈ విషయంలో ప్రజలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని లేఖలో కోరారు. ప్రభుత్వ విధానాలు మారాలని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ప్రభుత్వం పాల్పడుతుందని, ప్రభుత్వాలు నియంత పోకడలు మానుకోవాలని లేఖలో హెచ్చరించారు.
బీమాకోరేగావ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ రెండేళ్లుగా మహారాష్ట్ర జైలులో ఉంటూ ఇటీవల కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన విప్లవ రచయితల సంఘం (విరసం) నేత, కవి వరవరరావు పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ‘వరవరరావు అంపశయ్యపై ఉన్నారు. ఆరోగ్యం పూర్తిగా విషమించింది. మరి కొన్ని రోజులు మాత్రమే ఆయన బతికే అవకాశముంది. కనీసం తన కుటుంబ సభ్యుల మధ్య చనిపోయే అవకాశాన్ని ఆయనకు ఇవ్వండి. విచారణను ఏ విధంగానూ ప్రభావితం చేసే పరిస్థితిలో లేని వరవరరావుకు బెయిల్ ఇప్పించండి’’ అని కోర్టుకు లాయర్ విన్నవించడం జరిగింది.