Seethakka: నాపై కుట్ర జరుగుతోంది.. మావోయిస్టుల లేఖ‌పై స్పందించిన మంత్రి సీత‌క్క‌

Seethakka

Seethakka Responds: మావోయిస్టుల పేరుతో తనకు రాసిన లేఖపై మంత్రి సీతక్క స్పందించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో సీతక్క మీడియాతో మాట్లాడుతూ..మ‌హిళ అని కూడా చూడ‌కుండా మావోయిస్టుల లేఖ ముసుగులో తనపై అస‌భ్య ప‌ద‌జాలాన్ని వాడుతూ రాజ‌కీయ క‌క్ష‌ను తీర్చుకుంటున్నాయని మండిపడ్డారు. అసలు ఆ లేఖ మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిందా లేదా అనే దానిపై స్పష్టత లేదన్నారు. తనను ఎన్నికల్లో ఓడించాలని ఎన్నో శక్తులు పని చేశాయని.. అవే శ‌క్తులు ఇప్పుడు తనను టార్గెట్ చేస్తున్నాయని ఆమె ఆరోపించారు.

ఒక ఆదివాసీ మహిళకు మంత్రి పదవి ద‌క్క‌డాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక‌పోతున్నారని.. అందుకే తన వ్యక్తి గ‌త ప్ర‌తిష్ట‌ను దెబ్బతీసేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మావోయిస్టుల లేఖను అడ్డం పెట్టుకొని తనను అవమానిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. తనను ఓడించేందుకు వంద కోట్లు ఖర్చు చేశారని.. అయినా ములుగు ప్రజలు తనను రికార్డు మెజార్టీతో గెలిపించారని వెల్లడించారు.

తాను ఎన్నడూ ప్రజలకు దూరంగా లేనని.. ములుగు, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని తెలిపారు. తన నియోజ‌క‌ర్గంలో కొంతమంది అడ‌వి అధికారులు ఆదివాసి గుడిసెల మీద దాడి చేసిన ఘటన గురించి తెలియగానే అధికారులను అక్కడి నుంచి వెన‌క్కు పంపించి వేశానని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఆదివాసుల‌పై దాడులు చేశారన్నారు. అప్పుడు దాడులు చేసి ఇప్పుడు లేని ప్రేమ ఒల‌కబోస్తున్నారని సీతక్క ధ్వజమెత్తారు.

ఆదివాసులు, అట్టడుగు వర్గాలు కోసం తాను అండగా నిలబడతా అని స్పష్టం చేశారు. గిరిజ‌న సంక్షేమ మంత్రి కాకున్నా.. పార్టీల‌కు అతీతంగా ఎస్టీ ఎమ్మెల్యేలంద‌రితో స‌మావేశ‌మై జీవో 49 ను ర‌ద్దు చేయాల‌ని తీర్మానించామని గుర్తుచేశారు. ఏ హోదాలో, ఏ స్థాయిలో ఉన్నా తాను ఆదివాసి అడ‌వి బిడ్డ‌నే అని తెలిపారు. వారి సంక్షేమం, అభివృద్ది కోస‌మే తన జీవితం అంకితం అన్నారు.

కాగా ఆదివాసీ బిడ్డ అయిన సీతక్క మంత్రిగా ఉంటూ ఆదివాసీల బాగు కోసం పనిచేయడం లేదంటూ మావోయిస్టు అధికారి ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ విడుదలైంది. తెలంగాణలో ఆదివాసీల హక్కులకు సంబందించిన పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని లేఖలో పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్. 49తో కుమురం భీమ్ జిల్లాలో ఉన్న సుమారు 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని చూస్తోందంటూ ఆరోపణలు చేశారు. కీలక మంత్రిగా ఉన్న సీతక్క ఆదివాసీల హక్కుల గురించి కనీసం పట్టించుకోవడం లేదంటూ హెచ్చరించారు.