ఎన్ఐఏ దర్యాప్తు..టిడిపి నేతల అరెస్టు

దివంగత ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు హత్యకేసు విచారణను మొదలుపెట్టిందో లేదో ఎన్ఐఏ వెంటనే టిడిపి నేతలను అరెస్టులు చేసింది. కిడారి హత్యకేసును కేంద్ర హోం శాఖ చాలా ప్రిస్టేజిగా తీసుకున్నది. అంటే ఎంఎల్ఏ హత్య అనేకన్నా మావోయిస్టుల చేతిలో హతమవ్వటం కేంద్రానికి చాలా కీలకంగా మారింది. ఒకవైపు మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటే మరోవైపు అదే మావోయిస్టుల చేతిలో ఓ ఎంఎల్ఏ హత్యకు గురికవాటం గమనార్హం.

 

అందుకనే కిడారి హత్యపై సిట్ దర్యాప్తు పూర్తవ్వగానే ఎన్ఐఏ విచారణను తన చేతుల్లోకి తీసుకున్నది. గతంలో సిట్ కూడా పలువురు టిడిపి నేతలను అదుపులోకి తీసుకుని విచారించి తర్వాత వదిలేసింది. కానీ ఎన్ఐఏ రంగంలోకి దిగగానే ఎంఎల్ఏ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మావోయిస్టులకు చేరవేసిన యెడల సుబ్బారావును అరెస్టు చేసింది. కిడారి కదలికలను యెడల ఎప్పటికప్పుడు మావోయిస్టులకు చేరవేసేవాడు. మావోయిస్టులకు భయపడే వాడో లేకపోతే కిడారి అంటే వ్యతిరేకత వల్ల మావోయిస్టులకు సహకరించారో అర్ధం కావటం లేదు.

 

అందుకనే ఎన్ఐఏ సుబ్బారావుతో పాటు శోభన్ , కమల, ఈశ్వరిలను కూడా ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఎప్పుడైతే అరెస్టులు ఊపందుకున్నాయో టిడిపి నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే, కిడారి హత్యవెనుక ఎవరెవరి ప్రమేయం ఉందో ఎవరికీ తెలీదు. అది తెలియాలంటే ముందు వారిద్దరినీ విచారణ చేయక తప్పదు. అందుకనే నలుగురిని అరెస్టులు చేసింది ఎన్ఐఏ. వీళ్ళ అరెస్టు, విచారణతో ఎవరెవరి జాతకాలు బయటపడతాయో చూడాల్సిందే.