సామాన్యుడి నడ్డి విరుస్తున్న మోడీ రైల్వే నిర్ణయాలు!

దేశ ప్రధాని మోడీ చెప్పే మాటలకూ, చేసే పనులకూ పొంతన ఉండదనేది విపక్షాలు చేసే విమర్శలు. అయితే ఆ విమర్శలకు బలం చేకూర్చేలాగానే మోడీ ప్రవర్తన కూడా ఉంటుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని నిజం చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా మరోసారి సామాన్యుల విషయంలో మోడీ వైఖరిపై స్పష్టత వస్తోంది.

ఇప్పటికే ఇండియన్‌ రైల్వే గతంలో 60 ఏళ్లు పైబడిన పురుషులకు 40 శాతం, 58 ఏళ్లు పైబడిన స్త్రీలకు 50 శాతం చొప్పున టికెట్‌ ధరలో ఇచ్చే రాయితీని ఎత్తేసిన మోడీ సర్కార్… సామాన్య ప్రజలను ఇబ్బందిపెట్టే విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా… పేదలు, సామాన్యులు, వలస కూలీలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ప్రయాణించే జనరల్‌, స్లీపర్‌ క్లాస్‌ బోగీలపై రైల్వేశాఖ నిర్లక్ష్యం చూపిస్తోంది.

ప్రయాణికుల రద్దీ ఉండే అనేక రైళ్లలో ఏసీ బోగీలను పెంచాలని లక్ష్యాన్ని పెట్టుకున్న రైల్వే శాఖ… స్లీపర్‌ బోగీలను తగ్గించేయడంతోపాటు, జనరల్‌ బోగీలను మొక్కుబడిగా ఒకటి, రెండుకి పరిమితం చేస్తుంది. దీంతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వారు నరకం చూస్తున్నారు. మరిముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే అనేక రైళ్లలో ఇదే దుస్థితి నెలకొంది.

అనేక రైళ్లలో గతం కంటే స్లీపర్‌ బోగీలను తగ్గించి, వాటి స్థానంలో ఏసీ బోగీలను పెంచుకుంటూ పోతుంది రైల్వే శాఖ. సామాన్యుడి పరిస్థిత్కంటే ఆదాయం పైనే దృష్టిపెడుతున్న మోడీ ఆలోచనా విధానానికి ఇది ఒక ఉదాహరణ అని అంటున్నారు విశ్లేషకులు. ఫలితంగా… స్లీపర్‌ బెర్త్‌ కోసం ఎప్పుడు సెర్చ్ చేసినా 100-150 వెయిటింగ్ లిస్ట్ దర్శనమిస్తుంది!

ఉదాహరణకు ఏపీలోని పశ్చిమగోదావరిజిల్లా నరసాపుర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతీరోజూ హైదరాబాద్ కు వచ్చే నరసాపుర్ ఎక్స్ ప్రెస్ విషయాన్ని పరిశీలిద్దాం. ఈ ట్రైన్ లో ప్రయాణానికి స్లీపర్‌ బెర్త్‌ కు రూ.275 ఛార్జి ఉంటే, అదే థర్డ్‌ ఏసీకి రూ.745, సెకండ్‌ ఏసీకి రూ.1,050, ఫస్ట్‌ ఏసీకి రూ.1,765గా ఉంది. అంటే… స్లీపర్ బెర్త్ వల్ల రైల్వే కి వచ్చే ఆదాయానికి, ఆ స్థానంలో ఏసీ కోచ్ పెడితే వచ్చే ఆదాయానికి ఉన్న వ్యత్యాసం భారీగా ఉంటుంది.

దీంతో.. సామాన్యుడికి ఇబ్బందులు తలెత్తినా పర్లేదు.. తమ ఖజానా మాత్రం నిండిపోవాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ప్రవర్తిస్తున్న కేంద్రప్రభుత్వం… ఇలా సమాన్యుడి నడ్డివిరుస్తూ… ఖజానాలో జమవుతున్న సొమ్మును లెక్కలేసుకుంటుంది!