కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మ్యాజిక్ పని చేయలేదు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతలంతా కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టినా ఫలితం అనుకూలంగా రాకపోవడం గమనార్హం.
కర్ణుడి చావుకి కోటి కారణాలన్నట్టు.. కర్నాటకలో బీజేపీ పతనానికీ చాలా చాలా కారణాలున్నాయి. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ ‘అతి’ బీజేపీని కర్నాటకలో ముంచేసిందన్న చర్చ కర్నాటక రాజకీయ విశ్లేషకుల్లో ప్రముఖంగా కనిపిస్తోంది.
‘బీజేపీ తోక కత్తిరించాల్సిందే..’ ఈ మాట, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. చాలా రచ్చబండల వద్ద వినిపించిన మాట వాస్తవం. వంట గ్యాస్ ధర పెంపు, పెట్రోల్ – డీజిల్ ధరల వ్యవహారం.. వాట్ నాట్ చాలానే వున్నాయ్. కర్నాటకలో రాజకీయ సంక్షోభానికి ప్రతిసారీ బీజేపీనే కారణమవుతుండడమూ అక్కడి ప్రజల్లో బీజేపీ పట్ల ఏహ్యభావం పెరిగేలా చేసింది.
హిజబ్ వ్యవహారం.. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు.. చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా పెద్దదే. అన్ని పాపాలు చేసేసింది బీజేపీ.. అని కర్నాటక ఓటర్లే చెబుతున్నారు. ఒకప్పుడు ‘కాంగ్రెస్ ముక్త భారత్.. ఇప్పుడేమో, బీజేపీ ముక్త భారత్’.. ఈ చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.
కర్నాటకలో గెలిచి, తెలంగాణలోనూ సత్తా చాటి, ఆంధ్రప్రదేశ్ మీద కూడా పెత్తనం చేయాలనుకున్న బీజేపీకి షాక్ తగిలింది.