మాయావతి-అఖిలేశ్ చంద్రబాబుకు ఎలా షాకిచ్చారో చూడండి

(వి శంకరయ్య)

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపితో తెగ తెంపులు చేసుకున్న తర్వాత దేశ వ్యాప్తంగా బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు ముమ్మరం చేశారు. వివిధ రాష్ట్రాలు పర్యటనలు చేయడం ఢిల్లీకి తరచూ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో ఇంకా కొంత మంది ప్రతి పక్ష నేతలను కలసి సమావేశాలు నిర్వహించడం మన మెరుగుదుం.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ నెల కొల్పిన టిడిపిని చారిత్రక ఆవశ్యకతగా తెలంగాణ ఎన్నికలలో జట్టు కట్టింపజేసి వ్యతిరేక ఫలితాలు చవి చూచారు. . అంత క్రితమే రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అయిపోయి నట్లు 2019 ఎన్నికల తర్వాత ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చేసి నట్లు కూడా ప్రచారం ప్రారంభించారు . అయితే తెలంగాణ ఎన్నికలలో ఎదురు దెబ్బలు తగిలినా ముఖ్యమంత్రి చంద్రబాబు తన యత్నాలు మానుకోలేదు. ఎందుకంటే ఆయనకు జీవన్మరణ సమస్య కాబట్టి ఆయన పరిభాషలోనే చెప్పాలంటే ఆలా ముందుకు పోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెంది తెలంగాణలో ఎదురు దెబ్బ తిన్నా కాలికి బలపం కట్టుకొని బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటుకు తిరిగే ఒక నేతగా చంద్రబాబు దొరికి నందున వేచి చూచే ధోరణితో వున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి కావడం కాంగ్రెస్ కన్నా చంద్రబాబు ఎక్కువ అవసరం. .

ఎపిలో కాంగ్రెస్ టిడిపి కలసి పోటీ చేస్తాయా? 

అయితే ఈ లోపు మరో ప్రమాదం ముంచు కొచ్చింది. రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అయి ప్రత్యేక హోదా ఇస్తున్నపుడు కాంగ్రెస్ తో జట్టు కడితే తప్పేమిటని తన ప్రత్యర్థులకు ఎదురు ప్రశ్నలు వేసే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపిలో కాంగ్రెస్ తో కలసి పోటీ చేయాలనా? లేక విడివిడిగా పోటీ చేయాలా అనే అంశం ఇంత వరకు తేల్చు కోలేదు. అటు కాంగ్రెస్ ఇటు చంద్రబాబు డోలాయ మానంలో వున్నారు. తెలంగాణ అనుభవం కళ్ల ముందు వుండగా కాంగ్రెస్ పార్టీ కూడా మీన మేషాలు లెక్కించుతోంది. ఏది ఏమైనా ఎపి ఎన్నికల్లో కాంగ్రెస్ టిడిపి కలసి పోటీ చేయక పోతే దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సాగిస్తున్న బిజెపి వ్యతిరేక కూటమికి అర్థమే వుండదు. ఇది ఇద్దరికీ చిక్కే. ఈ లోపు మరో ప్రమాదం రానే వచ్చింది.

ప్రధాని అభ్యర్థిగా మమత

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలి నుండి కూడా బిజెపిని వ్యతిరేకిస్తున్నా అదే సమయంలో కాంగ్రెసుతో అంటి అంట నట్లు వుంటూ తను ప్రధాని పదవిపై ఆశ పెంచు కొన్నారు.
పైగా ఆమె అనుచరులు ఇటీవల కాబోయే ప్రధానిగా అభివర్ణించడం కాంగ్రెస్ కన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశలపై కుండెడు నీళ్లు కుమ్మరించి నట్లు అయింది. పైగా కలకత్తాలో నిర్వహించ నున్న ర్యాలీకి రాహుల్ గాంధీకి ఆహ్వానం వివాదం అయి ఆ అంశంపై వచ్చిన ప్రశ్నలకు చంద్రబాబు నీళ్లు నమల వలసి వచ్చింది..

మూడవ కూటమికి చేకూరిన బలం

ఇవన్నీ అటుంచి పులి మీద పుట్రలాగా 80 పార్లమెంటు స్థానాలు గల యుపి లో మాయావతి అఖిలేశ్ ఇద్దరు మాత్రమే తాజాగా జట్టు కట్టి కాంగ్రెస్ పార్టీని దూరంగా పెట్టడంతో కాంగ్రెస్ కన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు షాక్ తిన్నారు. ఎందుకంటే దేశ వ్యాప్తంగా బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు జరిగి రాహుల్ గాంధీని ప్రధానిని చేసే అనుకూల వాతావరణం ఎపిలో కనిపించితేనే చంద్రబాబు తన వాదనతో ప్రజలను మెప్పించగలరు. రాహుల్ గాంధీ ప్రధాని పదవి పొందితే తప్ప ఎపికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదు. ఇంకెవరు ప్రధాని పదవి పొందినా సమీకరణలు మారిపోయి అందని  పండుగా మిగిలి పోతుంది. ఉన్నట్లుండ ఈ ఆశలపై మాయావతి ఆఖిలేశ్ వాస్తవం చెప్పాలంటే నీళ్లు గుమ్మరించారు.
బిజెపి కన్నా కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ కడిగి పారేశారు. ఎప్పుడో విధించిన అత్యవసర పరిస్థితి గుర్తు చేసి కాంగ్రెస్ తో కలిస్తే ఓట్లు బదలీ కావని తేల్చి వేశారు. బోఫోర్స్ కుంభకోణం తెర మీదకు తెచ్చారు. అంత వరకైతే ఫర్వలేదు. ప్రధాని అభ్యర్థిగా మాయావతిని తెర మీదకు తీసుకు వచ్చారు.

ఈ దెబ్బతో ప్రధాని అభ్యర్థిగా ప్రతి పక్షం నుండి మూడో కృష్ణుడుగా మాయావతి రంగం మీదకు వచ్చారు. ఈ పరిణామం కాంగ్రెస్ కన్నా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేదు గుళికగా మిగిలింది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటూ చెప్ప లేక ఎన్నికల తర్వాత బిజెపి వ్యతిరేక కూటమిలోనికి వస్తారని జవాబు చెప్పి జవాబు దాట వేశారు. చంద్రబాబు చెప్పిన అంశం కొత్త దేమీ కాదు. వారిద్దరు ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగానే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే అసలు సమస్య అదికాదు.

ప్రధాని పదవిపై కొరవడిన ఏకీభావం

ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయంగా ఎవరు ప్రధాని అభ్యర్థిగా వుంటారనే అంశంపై దేశంలోని ప్రతి పక్షాలలో ఏకీభావం లేదు. యుపి పరిణామాలు మాయావతిని బలమైన అభ్యర్థిగా ముందుకు తేవడమే కాకుండా రాహుల్ గాంధీ ఆశలపై గట్టి దెబ్బ కొట్టింది.

యుపి పరిణామాలు పరిశీలించితే ఇదివరలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తెర మీదకు తీసుకు వచ్చిన ఫెడరల్ ఫ్రంట్ కు కొంత ఊపిరి ఏర్పడుతోంది. ఎందుకంటే మాయావతి అఖీలేశ్ కాంగ్రెస్ తో కలసే అవకాశం లేదని అంటున్నారు. పైగా బిజెపితో సమానంగా కాంగ్రెస్ పై బాణాలు ఎక్కు పెట్టారు. అంతేకాకుండా యుపిలో80 పార్లమెంటు స్థానాలు వున్నాయి.
వీరిద్దరూ బిజెపితో సమానంగా కాంగ్రెస్ ను దూరంగా పెట్ట దలుచు కొన్నందున మూడవ ఫ్రంట్ వీరి లక్ష్యంగా వుంటుంది. సరిగ్గా కెసిఆర్ కూడా ఇదే భావనతో వున్నారు. దీనికి తోడు ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ కాంగ్రెస్ కు బిజెపికి సమాన దూరంలో వుంటానని ప్రకటించినందున మూడవ కూటమికి మరి కొంత ప్రాతి పదిక ఏర్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మూడవ కూటమి గురించి అవహేళనగా మాట్లాడుతున్నారు. గాని పరిస్థితి ఇలాగే పరిణమించితే యుపి పరిణామాల తర్వాత కాంగ్రెస్ కూటమి బాగా బలహీన పడే అవకాశం లేక పోలేదు. తుదకు కాంగ్రెస్ గాని చంద్రబాబు గాని మోదీకి భయపడి మూడవ కూటమిలో తల దాచు కోవలసి రావచ్చు.

ఎపిలో వైసిపి విజయ బావుటా

ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన పలు సర్వేలలో మోదీ ప్రాభవం తగ్గి పోవచ్చు గాని ఏకైక పెద్ద పార్టీగా బిజెపి వస్తుందని తెలుపు తున్నాయి. గత నవంబర్ లో జాతీయ స్థాయిలో నిర్వహించ బడిన ఒక సర్వేలో బిజెపి కూటమి 281 స్థానాలలో గెలుపొందుతుందని తేల్చితే డిసెంబర్ నెలలో నిర్వహించ బడిన మరొక సర్వే లో257 స్థానాలు మాత్రమే దక్కించు కొంటుందని తేలింది.నాలుగు రాష్ట్రాలలో బిజెపి ఓటమి తర్వాత ఈ సర్వే జరిగింది.
అదే సమయంలో కాంగ్రెసు కూటమి 146 కే పరిమితం అవుతుందని డిసెంబర్ సర్వే తెలిపింది. కాగా ఈ రెండు కూటములు కాకుండా పలు ప్రాంతీయ పార్టీలు 140 స్థానాల్లో గెలుపు సాధించే అవకాశం వుందని ఈ పార్టీలు కింగ్ మేకర్స్ అయ్యే అవకాశం ఉందని డిసెంబర్ సర్వే నిర్ధారించింది.
ఈ ప్రాంతీయ పార్టీలలో టియంసి 26-బిజెడి13 అన్నాడియంకె 10ఎపి లో వైసిపి 19 టిఆర్ఎస్ 16 బియస్పీ15 సమాజవాద పార్టీ 20 కాంగ్రెస్ బిజెపికిదూరంగా వుండే మరి కొన్ని చిన్న పార్టీలు గెలుపు సాధిస్తాయని నిగ్గు తేల్చింది. ఇటీవల జాతీయ సర్వే లన్నీ ఎపిలో వైసిపి మెజారిటీ స్థానాలు దక్కించు కొంటుందని చెబుతున్నా ఎపిలోని పాపులర్ మీడియా తొక్కి పెట్టడం జరుగుతోంది.

టిడిపి ఓటమి పాపులర్ మీడియా ఓటమా?

ఈ రెండు సర్వేలు కూడా టీడీపీ నాలుగు స్థానాల్లో గెలుపొందుతుందని చెప్పాయి. ఎపిలో ముఖ్యమంత్రికే కాకుండా మీడియా కు ఇవి చేదు గుళికలే. కాని విశాలాంధ్ర ఈ వార్త ఇచ్చింది.బహుశా ఈ పరిణామాలను పసి గట్టిన వైసిపి నేత జగన్ కెసిఆర్ సహకారంతో మూడవ కూటమి ద్వారా ప్రత్యేక హోదా సాధిస్తానని చెబితే ముఖ్యమంత్రి అవహేళనగా మాట్లాడిన మరు రోజే యుపి పరిణామాలు సంభవించి ఆయనకు దిగ్భ్రాంతిని మిగిల్చాయి. రాజ పరిణామాలు ఎప్పుడూ నేతలు ఆశించే విధంగా వుండవు.

కేంద్రం లో ఎవరు అధికారంలోనికి రావాలన్నా మొత్తం 543 స్థానాలకు 272 మంది సభ్యులు వుండాలి.
ఈ సర్వే గణాంకాలు పరిశీలించితే ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం వుంది. కాని బిజెపి కాంగ్రెస్ రెండు పార్టీలను దూరంగా పెట్టి అధికారం చేపట్టే అవకాశం లేదు. అంతేకాదు.

ప్రాంతీయ పార్టీలు కీలకం

ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా బిజెపి గాని కాంగ్రెస్ కూటములు అధికారంలోనికి రాలేవు.
గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే తాజాగా యుపి పరిణామాలు దృష్టిలో పెట్టుకొంటే రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి పదవి దక్కించుకొనే అవకాశాలు ఏ మాత్రం లేదు.
సర్వేల ప్రకారం బిజెపి దరిదాపు ల్లో వున్నందున మోదీతో పాటు ప్రాంతీయ పార్టీలు హవా వున్నందున . మాయావతి మమత వీరు రేసులో వుండ బోతున్నారు. రాహుల్ గాంధీ తుదకు కర్నాటక గేమ్ ఆడ వలసి వుంటుందేమో.   

(శంకరయ్య, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యాఖ్యాత)