లాక్ డౌన్ విషయంలో జగన్ రిస్కు తీసుకుంటున్నారా?

లాక్ డౌన్ విషయంలో జగన్ రిస్కు తీసుకుంటున్నారా?

లాక్ డౌన్ తో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. జీతాలు రావడం లేదు. చిరు వ్యాపారులు, బడుగు జీవులు తీవ్రంగా దెబ్బతిన్నారు.

ఎలెక్ట్రిషియన్స్, ప్లంబర్లు, మోటార్ మెకానిక్ లు వంటి చిన్న జీవితాలు ఛిద్రం అయ్యాయి. లక్షలాది చిన్న, మధ్యతరహా ప్రింటింగ్ ప్రెస్ లు మూతపడ్డాయి. ఫాన్సీ షాపులు, ఇతర దుకాణాలు మూసే ఉండడంతో వాటిల్లో పనిచేసే వేలాది మందికి ఆదాయం లేదు. ఈ కారణాలుగా మార్కెట్లో నగదు లేదు.

వ్యాపార లావాదేవీలు ఎలాగూ లేవు, కనీసం జీతభత్యాలు కూడా లేక సాధారణ జీవి ఆసరా కోసం చూస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు కార్పొరేట్ ఋణాలు పక్కన పెట్టి చిన్న ఋణాలు, తక్కువ వడ్డీకి విస్తృతంగా ఇచ్చి ప్రజలను ఆదుకోవాలి.

బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు తామిచ్చిన ఋణాలపై నెల వాయిదాలు (EMI లు) వసూలు చేస్తున్నాయి. మారటోరియం కారణంగా వాయిదా చెల్లించకపోతే వడ్డీని అసలు ఋణంలో కలిపేసి రాబోయేనెలల్లో వసూలు చేస్తాయి. ఇది ఋణ జీవులకు మరింత భారం అవుతుంది.

ప్రజలపై ఆర్ధిక భారం తగ్గించేందుకు, ప్రజల చేతుల్లో నగదు ఉండేట్లు తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకునే వైద్య ఆరోగ్య చర్యలు వ్యాధినుండి కాపాడితే, ఆర్ధిక చర్యలు విపత్తు నుండి కాపాడతాయి. అటువంటి చర్యలు అవసరం.

అవసరమైతే లాక్ డౌన్ సమయంలో ప్రజల అన్నిరకాల పొదుపు తదితర డిపాజిట్లపై వడ్డీ రద్దుచేసి ఆమేరకు ప్రజలకు చేయూత ఇచ్చే ప్రయత్నం చేయాలి. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు చెపుతున్న ఆర్ధిక ఉద్దేపన చర్యలు ఈ దిశగా సాగితే తప్ప ఈ దెబ్బనుండి ప్రజలు కోలుకునే అవకాశం లేదు. 

అందుకే పాక్షికంగానైనా లాక్ డౌన్ సడలింపు జరగడమే దేశ ఆర్ధిక పరిస్థితి పురోగమనానికి అవసరం.ఈ సడలింపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలపర్చాలనుకోవడం ఖచ్చితంగా రిస్క్ తో కూడుకున్న నిర్ణయం. కానీ అప్పుల ఊబిలో వున్నా రాష్ట్రానికి ప్రజా ఆరోగ్యం తో పాటు ఆర్ధిక ఆరోగ్యం కూడా అవసరం. ఇటువంటి సమయంలో ప్రభుత్వం తో పాటు ప్రజలు కూడా బాధ్యతతో మెలగాలి.