షుగర్ కోటింగ్ థ్రిల్లర్ – ‘రాక్షసుడు’ రివ్యూ!

షుగర్ కోటింగ్ థ్రిల్లర్ – ‘రాక్షసుడు’ రివ్యూ!

హిట్ అన్నది పట్టుబడకుండా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సాగిస్తున్న ప్రయాణం చివరికి హిట్ రీమేక్ దగ్గర పరీక్షకి నిలబడింది. గత ‘సీత’ కూడా గల్లంతయ్యాక ‘రాక్షసుడు’ తో వచ్చాడు. హిట్లు లేని ‘రైడ్’ ఫేమ్ దర్శకుడు రమేష్ వర్మ కూడా ఈ రీమేక్ తో అమీ తుమీకి సిద్ధపడ్డాడు. పసలేని రొమాంటిక్ కామెడీల సీజన్ సమాప్తమై సస్పెన్స్ థ్రిల్లర్స్ విరివిగా వస్తున్న కొత్త సీజన్లో ఈ ఇద్దరూ ఏం సాధించారో ఒకసారి చూద్దాం…

కథ: 
అరుణ్ (బెల్లంకొండ) సైకో థ్రిల్లర్ కథ రాసుకుని దర్శకత్వ అవకాశాల కోసం విఫల యత్నాలు చేసి, ఇంట్లో వొత్తిడి తట్టుకోలేక ఎస్సై అవుతాడు. అతడి బావ (రాజీవ్ కనకాల) సీనియర్ ఎస్సై. వీళ్ళ పై అధికారిణి ఎసిపి లక్ష్మి వీళ్ళని ఓ ఆటాడిస్తూంటుంది. అరుణ్ డ్యూటీలో జాయినవగానే స్కూలు బాలికల హత్యలు దృష్టి కొస్తాయి. తాజాగా ఇంకో స్కూలు బాలిక హత్యకి గురవుతుంది.. ఈ హత్యలన్నిటిలో హంతకుడి సిగ్నేచర్ గా ఓ బొమ్మ తాలూకు తల వుంటుంది. ఇవి సీరియల్ కిల్లర్ చేస్తున్న హత్యలని, తను కథ రాసుకున్నప్పుడు చేసుకున్న రీసేర్చి ఆధారంగా అభిప్రాయానికొచ్చి దర్యాప్తు మొదలెడతాడు. ఈ క్రమంలో స్కూల్ టీచర్ కృష్ణవేణి (అనుపమా పరమేశ్వరన్) పరిచయమవుతుంది. ఇలా వుండగా, బాలికల హత్యలు ఆగవు. ఇక అరుణ్ ఏ చర్యలు తీసుకుని ఈ హత్యల్ని ఆపి సీరియల్ కిల్లర్ ని పట్టుకున్నాడనేది మిగతా కథ.

ఎలా వుంది కథ:
సైకో కిల్లర్ కథలు ఫారిన్ కాన్సెప్ట్. వాస్తవంగా ఇవి మన సమాజంలో అరుదుగా ఎప్పుడో గానీ అనుభవమయ్యేవి కావు. మన సమాజంలో చిన్న పిల్లల కిడ్నాపులు, ఆడపిల్లల మీద అత్యాచారాలూ ఒకవైపు ఆందోళనకర స్థాయిలో చోటుచేసుకుంటున్న నిత్య నేర వార్తలయ్యాయి. వీటిని కాలక్షేప కథలుగా తీసి వేయలేం. కానీ ఫారిన్ కాన్సెప్ట్ అయిన సైకో కిల్లర్ కథల్ని తెచ్చుకుని కాలక్షేప కథలుగా ఎంజాయ్ చేస్తున్నాం. వాస్తవ పరిస్థితిని చూడలేకపోతున్నాం. వాస్తవ పరిస్థితిని చిత్రించినట్టయితే కథా ప్రయోజనం నెరవేరేది.

బాలబాలికల భద్రత విషయంగా సామాజికాందోళన అనే వాస్తవ సమస్య నుంచి ఈ కాలక్షేప థ్రిల్లర్ ఎంత దూరంగా వుందంటే, పోలీసు పాత్రలు అసమర్ధంగా ప్రవర్తించేంతగా. స్కూలు బాలికలు విడివిడిగా, ఒంటరిగా ఆటోల్లో వెళ్ళడమేమిటి? స్కూలు బస్సుల్లో పంపాలని హెచ్చరించ వచ్చుగా? పేరెంట్స్ కూడా పిల్లలు ఎలా పోతారో పొమ్మన్నట్టు వదిలేసి కూర్చోవడమేమిటి, ఒకపక్క సైకో కిల్లర్ పంజా విసురుతూంటే? పోలీసు అధికారికి కూడా ఈ తెలివిలేక కూతుర్ని పోగొట్టుకుని ఏడుస్తాడు.

చివరికి సైకోకిల్లర్ పాత్ర గానీ, వాడి కథగానీ మనదేశ వాతావరణంలోనే ఇమడని పరాయితనంతో, హాలీవుడ్ మూవీ టైపులో వుంది. వాస్తవాలు మరచి కేవలం బుర్ర అప్పగించి ఎంజాయ్ చేయడం కోసమైతే ఈ సైకో థ్రిల్లర్ తమిళ రీమేకు కరెక్టే.

ఎవరెలా చేశారు:
బెల్లంకొండ శ్రీనివాస్ కి సీరియస్ ఎస్సై పాత్ర సరిపోయింది. రోమాన్సు కామెడీ డాన్సులు చేసే ఇబ్బంది తప్పింది. దర్శకత్వ ప్రయత్నాలు చేసే పాత్రలో సామాజిక స్పృహ లేక, ఫారిన్ సీరియల్ కిల్లర్స్ మీద రీసెర్చి అంటూ వేరేలోకంలో విచిత్రంగా తోస్తాడు. అతను ప్రస్తావించే సీరియల్ కిల్లర్స్ లో ఒకడు తప్ప అందరూ ఫారినర్సే. అందుకేనేమో ప్రతీ నిర్మాతా తిరస్కరించాడు. అయినా అదే కథ పట్టుకుని ఎనిమిదేళ్ళూ తిరగడం విచిత్రం. ఐతే సీరియస్ పాత్ర పోషణలో ముఖంలో వివిధ ఎమోషన్స్ కూడా పలికితే బావుండేది. ఈ విషయంలో మాత్రం బెల్లంకొండ కష్టపడాల్సి వుంది.

టీచర్ గా అనుపమా పరమేశ్వరన్ కి పెద్దగా పాత్ర లేదు. ఈ థ్రిల్లర్ లో ఆమె అప్రధాన పాత్ర. స్కూల్లో, హీరోతో వున్న సీన్లలో అప్పుడప్పుడు హోమ్లీ ఫీల్ కల్గించడం కోసం ముచ్చటైన ముఖంతో బావుంది.

వీళ్ళంతా ఏమోగానీ పాత్రలంటే బాలికల పాత్రలే. వీళ్ళకే బాగా నటించగల్గే పాత్రలున్నాయి, నటించారు కూడా. ఇక కూతుర్ని పోగొట్టుకున్న పోలీసు అధికారి పాత్రలో రాజీవ్ కనకాల ఓవర్ మెలోడ్రామా. అంతమంది బాలికలు చనిపోతున్న నేపధ్యంలో పోలీసు అధికారిగా తనకూతురి మరణానికే అంతలా ఏడవడం అతికే వ్యవహారంలా లేదు. ఈ కథ తన కూతురు ఒక్కతే చనిపోయే కథగా వుంటే ఈ ఏడ్పు సరిపోతుంది. ఈ ఏడ్చిన తర్వాత కేసుని హీరోకి వదిలేసి వెళ్ళిపోయే బలహీన పాత్ర. ఇతర పాత్రలు, పాత్రధారులు ఫర్వాలేదు. కానీ ఇందరు పోలీసు అధికారులు, ఉన్నతాధి కారులు వుండీ కూడా నగరంలో బాలికల సీరియల్ హత్యల దృష్ట్యా ప్రజల్ని హెచ్చరిస్తూ ఒక్క ప్రకటనా చేయకపోవడం విడ్డూరం.

కెమెరా, సంగీతం, ఇతర సాంకేతికాలు బెల్లంకొండ స్థాయిలోనే వున్నాయి.

చివరికేమిటి:
రమేష్ వర్మ దర్శకత్వంలో ఇది యథా తథంగా తీసిన రీమేక్. ఒరిజినల్ దర్శకుడి సమయస్ఫూర్తి ఇందుకు తోడ్పడింది. ఇది పూర్తిగా సినిమాల్ని విఫలం చేసే ఎండ్ సస్పెన్స్ తో కూడిన కథ. సీరియల్ కిల్లర్ ఎవరో చివరి వరకూ బయటపడదు. చివరిదాకా దాచిపెడితే భరించడం కష్టం. అందుకని ఈ ఎండ్ సస్పెన్స్ గండాన్ని దాటేందుకు ఫస్టాఫ్ లో టీచర్ పాత్రని ఓపెన్ చేసి ఇంటర్వెల్ వరకూ దాని మీద దృష్టి మరల్చారు. కాబట్టి ఫస్టాఫ్ లో విషయం తేలని ఫీలింగ్ లేకుండా పోయింది. సెకండాఫ్ లో మళ్ళీ ఫ్రెష్ గా సీరియల్ కిల్లర్ ఎవరనే సస్పెన్స్ మొదలెట్టారు. అప్పుడిది సగం సినిమా వరకే ఎండ్ సస్పెన్స్ కిందికి రావడంతో ప్రమాదం తప్పింది.

కాకపోతే సీరియల్ కిల్లర్ ఫ్లాష్ బ్యాక్, ఎందుకు చంపుతున్నాడనే కారణం బలంగా వుండవు. నేటివిటీ సరే. కానీ మిగతా ఇన్వెస్టిగేషన్, చివర్లో సీరియల్స్ కిల్లర్ ఎత్తుగడలు పకడ్బందీగా వుండి కూర్చోబెడతాయి. వాస్తవంగా జరుగుతున్న సంఘటనల్ని మర్చిపోయి కాలక్షేపానికి పనికొచ్చే, వాస్తవాలకి షుగర్ కోటింగ్ వేసిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది.

దర్శకత్వం : రమేష్ వర్మ
తారాగణం : బెల్లం కొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్, శరవణన్ రాజీవ్ కనకాల తదితరులు
కథ – స్క్రీన్ ప్లే : రామ్ కుమార్, మాటలు : సాగర్, సంగీతం: చింతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : వెంకట్ సి దిలీప్
బ్యానర్ : ఎ స్టూడియో
నిర్మాత : కోనేరు సత్యనారాయణ
విడుదల : ఆగస్టు 2, 2019
2.5

-సికిందర్