కెరీర్ ఆరంభంలో బాయ్ వండర్‌గా గుర్తింపు పొందిన పృథ్వీ షా… ఇప్పుడు తన జీవితంలోని జరిగిన కొన్ని ఘటనలను బయటపెట్టాడు. క్రికెట్ నుంచి కొంతదూరంగా వెళ్లిన తరువాత, తనలో జరిగిన మార్పుల గురించి ఓ ఇంటర్వ్యూలో ఎంతో స్పష్టంగా, భావోద్వేగంతో చెప్పాడు. 2023 వరకు తన జీవితం మొత్తం క్రికెట్‌నే ఉండేదని.. రోజుకు పదిగంటల పాటు ప్రాక్టీస్ చేసేవాడిని. కానీ ఆ తర్వాత తాను మారిపోయానని తెలుసుకోలేకపోయానని చెప్పాడు. కొత్త స్నేహితులు వచ్చరని.. వాళ్లు తన జీవితాన్ని నాశనం చేశారని పేర్కొన్నాడు.
వాళ్ల వల్లే నా ఫోకస్ పోయిందని తెలిపాడు. ఆటకు ఇవ్వాల్సిన 10 గంటలు నాలుగు గంటలకే పరిమితమయ్యిందని పృథ్వీ షా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతలో తన తాతగారి మరణం జరగడం తన మనసును పూర్తిగా పాడైపోయిందని పేర్కొన్నాడు. ఆయన నా స్ఫూర్తి. ఆయన లేకపోవడం చిన్న విషయం కాదు. నిజంగా నా లోపల ఏదో జరిగిపోయినట్లు అనిపించిందని తెలిపాడు. ఇప్పటికీ ఆ దుఃఖం నుంచి పూర్తిగా బయటపడలేకపోతున్నాను అంటూ భావోద్వేగంతో స్పందించాడు. తన జీవితంలో వచ్చిన ఒత్తిళ్ల సమయంలో తండ్రే తనకు తడబడని తోడుగా నిలిచాడని.. తాను ఇవాళ్టికి మిగిలింది నాన్నగారే. నేను ఎంత పతనమైనా.. ఆయన మాత్రం నన్ను వదలలేదు. ఇదే నాకు బలం అంటూ చెప్పారు.
ఐపీఎల్ 2025 వేలంలో ఏ టీమ్ కూడా తనపై ఆసక్తి చూపకపోవడం, ముంబయి రంజీ జట్టులో కూడా స్థానం కోల్పోవడం తనను ఎంతో ఇబ్బంది పెట్టాయని షా వివరించాడు. ఇప్పుడు మళ్లీ ఆటపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నానని.. ముంబయి క్రికెట్ సంఘం నుంచి NOC తీసుకుని, కొత్త జట్టులో కొనసాగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఇంత బాధలు చూసిన తర్వాత పృథ్వీ షా మళ్లీ అదే తప్పులు చేయకుండా, క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ రెండో ఇన్నింగ్స్‌లో నిజంగా విజయం సాధిస్తే… అది కేవలం ఓ ఆటగాడి రీటర్న్ మాత్రమే కాదు… ఒక యువకుడి ఆత్మ విశ్వాసపు గెలుపు అవుతుంది.