టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా–పాక్ మ్యాచ్ రద్దా.. క్రికెట్ అభిమానులకు భారీ షాక్..!

ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు ముందే భారీ వివాదం రాజుకుంది. క్రికెట్ అభిమానులు ఊపిరి ఆపుకుని ఎదురుచూస్తున్న భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై ఇప్పుడు అనిశ్చితి మేఘాలు కమ్ముకున్నాయి. టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను బహిష్కరించే దిశగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆలోచన చేస్తోందన్న సమాచారం క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తీసుకున్న కొన్ని నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పీసీబీ, నిరసనలో భాగంగా భారత్‌తో మ్యాచ్ ఆడకుండా ఉండాలని యోచిస్తున్నట్లు పాక్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అవసరమైతే టోర్నీ నుంచే పూర్తిగా వైదొలగే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ కీలక అంశంపై పీసీబీ ఛైర్మన్, పాకిస్థాన్ హోం మంత్రి మొహ్సిన్ నక్వీ త్వరలోనే ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది బంగ్లాదేశ్ జట్టు వైదొలగిన అంశం. భద్రతా కారణాలతో టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటున్నట్లు బంగ్లా జట్టు ప్రకటించగా, వారి స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పీసీబీ, బంగ్లాదేశ్ అభ్యర్థనకు మద్దతిచ్చిన ఏకైక దేశంగా నిలిచింది. ఐసీసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ నక్వీ బహిరంగంగానే విమర్శలు చేశారు.

అయితే ఐసీసీ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. టోర్నీ ప్రారంభానికి కొన్ని వారాలే మిగిలి ఉండటంతో మ్యాచ్ వేదికల మార్పు సాధ్యం కాదని, బంగ్లా జట్టుకు తక్షణ భద్రతా ముప్పు లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ వివరణతో పీసీబీ సంతృప్తి చెందలేదు. దాయాది దేశంతో జరిగే మ్యాచ్‌ను రాజకీయ రంగు పులుముతూ బహిష్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని క్రికెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ఒకవేళ పాకిస్థాన్ జట్టు భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే, ఐసీసీ నిబంధనల ప్రకారం అది ఫర్‌ఫీట్‌గా పరిగణిస్తారు. గ్రూప్–ఏలో భారత్, పాకిస్థాన్‌తో పాటు అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉండగా, కేవలం రెండు జట్లకే తదుపరి రౌండ్‌కు అర్హత లభిస్తుంది. భారత్‌పై పాయింట్లు కోల్పోతే పాక్ సెమీఫైనల్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అప్పుడు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన ఒత్తిడి పాకిస్థాన్‌పై పడుతుంది.

మరోవైపు టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకుంటే పీసీబీకి తీవ్రమైన ఆర్థిక నష్టంతో పాటు నిషేధం తప్పదని ఐసీసీ వర్గాలు అనధికారికంగా హెచ్చరిస్తున్నాయి. రాజకీయ కారణాలతో క్రీడలను బలి చేస్తే సహించబోమన్న సంకేతాలను ప్రపంచ క్రికెట్ సమాఖ్య ఇప్పటికే పంపింది. భారత్–పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతుండగా, పాక్ ప్రభుత్వ తుది నిర్ణయం కోసం ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.