ఇషాన్–సూర్య సునామీ షో.. రాయ్‌పూర్‌లో కివీస్ పై టీమిండియా సూపర్ విక్టరీ..!

రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ టీమిండియా అభిమానులకు ఊహించని ఉత్సాహాన్ని అందించింది. భారీ లక్ష్యాలే భారత్‌కు అలవాటైనా.. ఈసారి కథ మొదలైన తీరు మాత్రం కాస్త కంగారు పెట్టింది. 209 పరుగుల ఛేజింగ్‌లో భారత్ తొలి ఓవర్లలోనే తీవ్ర ఒత్తిడిలో పడింది. తక్కువ స్కోర్ కే ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ పెవిలియన్ బాట పట్టడంతో స్టేడియంలో నిశ్శబ్దం అలుముకుంది.

అలాంటి క్లిష్ట సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ దిశనే మార్చేశారు. తొలి బంతి నుంచే దాడే లక్ష్యంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ, న్యూజిలాండ్ బౌలర్లపై ఎలాంటి కరుణ చూపలేదు. పవర్‌ప్లే ముగిసేలోపే బౌండరీల వర్షం కురిపిస్తూ, కేవలం 8 ఓవర్లలో స్కోరును మూడు అంకెలకు చేర్చారు. భారత్ ఒత్తిడిలో ఉందన్న భావన ఒక్కసారిగా గాల్లో కలిసిపోయింది.

ప్రత్యేకంగా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ప్రేక్షకులను కుర్చీలకు అతికించింది. వేగం, టైమింగ్, పవర్.. అన్నీ కలబోసిన ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్ కేవలం 32 బంతుల్లోనే 76 పరుగులు సాధించాడు. గ్రౌండ్ నలుమూలలకూ బంతిని పంపిస్తూ కివీస్ బౌలింగ్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ తన ట్రేడ్‌మార్క్ 360 డిగ్రీ షాట్లతో అభిమానులకు పండుగ వాతావరణం తీసుకొచ్చాడు. కేవలం 23 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసి, మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.

ఇషాన్ అవుటైన తర్వాత కూడా సూర్య ఆగలేదు. చివరి వరకు క్రీజ్‌లో నిలబడి 37 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి శివమ్ దూబే చక్కటి సహకారం అందించడంతో భారత్ కేవలం 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 28 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగియడం భారత్ బ్యాటింగ్ శక్తికి నిదర్శనంగా నిలిచింది.

అంతక ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 208 పరుగులు చేసినా, అది సరిపోలేదు. కెప్టెన్ శాంట్నర్, రచిన్ రవీంద్ర కీలక ఇన్నింగ్స్‌లు ఆడినా.. భారత బ్యాటర్ల విధ్వంసం ముందు ఆ స్కోరు చిన్నదిగానే కనిపించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రాయ్‌పూర్‌లో టీమిండియా ఆడిన 100వ హోమ్ టీ20 మ్యాచ్‌ను ఈ విధంగా గుర్తుండిపోయే విజయంతో మలచడం అభిమానులకు మరపురాని క్షణంగా మారింది.