రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు: హీరో విజయ్‌ ఆంటోని!

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని హీరో విజయ్‌ ఆంటోని అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘రోమియో’ ఇటీవల విడుదలై హిట్‌ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బులు ఇస్తే ఓటర్లు తీసుకుని విూకు నచ్చిన మంచి అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా, వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటీవల మదురైకు వెళ్లిన ఆయన్ను ఇదే అంశంపై విూడియా ప్రశ్నించగా, తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు.

ఓటుకు డబ్బులు తీసుకోవడం మంచిదని నేను చెప్పలేదు. పేదరికంలో మగ్గుతున్నవారు డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ.. అలాంటివారు మంచి వారిని ఎంచుకుని ఓటు వేయాలని కోరా. నేను సాధారణంగా మాట్లాడే విషయాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. అలాంటి ఆలోచనలు నాకు లేవు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య యుద్దాలు జరుగుతున్నాయి. కానీ, భారత్‌లో మాత్రం శాంతియుత వాతావరణం నెలకొంది. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ శాంతిని కాపాడుతారు. భవిష్యత్తులో రాజకీయాలకు వచ్చే విషయంపై ఇప్పటికైతే ఎలాంటి ఆలోచన లేదు‘ అని పేర్కొన్నారు.

కాగా..’రోమియో’ మూవీ తెలుగులో ’లవ్‌ గురు’ పేరుతో విడుదలైంది. ఈ సినిమా నుంచి ఓ ఎగ్జైటింగ్ ఆఫర్‌ను మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు.’లవ్‌ గురు’ సినిమా చూసే ప్రేక్షకులలో విజేతలను ఫ్యామిలీతో సమ్మర్‌ హాలీడే టూర్‌ తీసుకెళ్తామని ప్రకటించారు. ఫస్ట్‌ ప్రైజ్‌ విన్నర్‌కు మలేషియా, సెకండ్‌ ప్రైజ్‌ విజేతకు కాశ్మీర్‌, థర్డ్‌ ప్రైజ్‌ విన్నర్‌కు ఊటీకి హాలీడే ట్రిప్‌ తీసుకెళ్తామని ‘లవ్‌ గురు’ టీమ్‌ తెలిపింది. మృణాళిని రవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను విజయ్‌ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌ పై విూరా విజయ్‌ ఆంటోనీ సమర్పణలో విజయ్‌ ఆంటోనీ నిర్మించారు.