Badhrakali Movie Review: ‘భద్రకాళి’ మూవీ: కమర్షియలైజ్ చేసి దారి తప్పారు !

తమిళ స్టార్ విజయ్ ఆంటోనీ 25వ మూవీ ‘భద్రకాళి’ (తమిళంలో ‘శక్తి తిరుమగన్) పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందు కొచ్చింది. విజయ్ ఆంటోనీ తన రియలిస్టిక్ పాత్రలకి భిన్నంగా ఈసారి ఫక్తు కమర్షియల్ పాత్ర నటిస్తూ ఒక ప్రయోగం లాంటిది చేశాడు. ‘అరువి’, ‘వాళి’ వంటి విభిన్న సినిమాలు తీసిన అరుణ్ ప్రభు దీనికి దర్శకుడు. ఇతను కూడా తను తీసిన రెండు రియలిస్టిక్ సినిమాలనుంచి దూరం జరిగి పక్కా కమర్షియల్ కి పూనుకున్నాడు. రాజకీయ థ్రిల్లర్లు ఎన్నో వచ్చాయి. అయితే రాజకీయ బ్రోకర్ గురించిన సినిమాలు అరుదు. ఒకప్పుడుతెలుగులో ఆర్పీ పట్నాయక్ తో ‘బ్రోకర్’ అని విడుదలైంది. రాజకీయ బ్రోకర్ ఎలా ఉంటాడనేది ఇందులో రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇదే థీమ్ తో విజయ్ ఆంటోనీ కమర్షియల్ కోణం ఎలా వుంది ? థీమ్ తగ్గ న్యాయం చేసిందా, లేక కమర్షియలైజ్ చేయడంతో దారితప్పి ఎటో వెళ్లిపోయిందా తెలుసుకుందాం…

కథేమిటి ?
కిట్టూ (విజయ్ ఆంటోనీ) సెక్రటేరియట్ లో ఒక పొలిటికల్ బ్రోకర్. పనుల మీద అక్కడికొచ్చే వాళ్లకి ఎలాటి పనైనా చేసి పెట్టి కమిషన్ తీసుకుంటాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలూ మొదలైన రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలుంటాయి. చిన్న చిన్న పైరవీల నుంచీ కోట్లలో జరిగే డీల్స్ వరకూ అన్నీ చక్కబెడతాడు. ఈ క్రమంలో 200 కోట్లుతో పెద్ద ఆఫర్ వస్తుంది. ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పి, ఆ పని చేస్తాడు. యితే అదే అతడికి రివర్స్ అవుతుంది. ఇది ఒక బడా వ్యక్తి అభయంకర్ (సునీల్ కృపాలాని) కి ఎఫెక్ట్ అవుతుంది. దీంతో ఇతను కిట్టూ మీద నిఘా పెట్టిస్తాడు. ఈ క్రమంలో కిట్టూ ఆరువేల రెండువందల కోట్లు సంపాదించాడని తెలుస్తుంది. ఇంత డబ్బు ఎక్కడ దాచాడు? ఏమిటసలు కిట్టూ కథ? అసలు ఎవరు ఇతను ? ఏం చే యబోతున్నాడు? ఈ మిస్టరీతో కొనసాగేదే మిగతా కథ.

కాళేశ్వరంపై మాటల యుద్ధం.. హరీష్ రావు గట్టి కౌంటర్

గ్రామస్తుల సమస్య – గంట వ్యవధిలోనే పరిష్కరించిన ఎరిక్షన్ బాబు

ఎలా వుంది కథ?
ఈ కథ చట్టానికి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ పనిచేసే, తన అవసరాలకు అనుగుణంగా రాజకీయ దృశ్యాన్ని మార్చుకునే రాజకీయ బ్రోకర్ చుట్టూ తిరుగుతుంది. ఇతను తెర వెనుక బడా రాజకీయ శక్తి చేతిలో కీలుబొమ్మగానూ మారే దురవస్థని ఎదుర్కొంటాడు. అంతేగాక ఈ కథ, నిజ జీవిత సంఘటనలతో, కొందరు వ్యక్తుల అనుభవాలతో ప్రేరణ పొంది, యూట్యూబ్ వీడియోలతో ప్రస్తుత రాజకీయ చర్చలని కూడా ప్రస్తావించే కఠినమైన, డేటా-ఆధారిత కథనాన్ని అందిస్తుంది. ఈ వాస్తవికతతో కూడిన పునాది కథకి ఒక బలమైన ఎడ్జ్ నిస్తుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణంపై ప్రజాగ్రహంగానూ ప్రతిధ్వనిస్తుంది. ఇలా సినిమా మొదటి సగం రియలిస్టిక్ జానర్ లో బలమైన పునాదిని ఏర్పరుస్తుంది. రాజకీయ బ్రోకర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో జాగ్రత్తగా వివరిస్తుంది.

విజయ్ ఆంటోనీ కమాండింగ్ నటన ఇంతవరకూ ఫస్టాఫ్ కథకి ఎంతో సహాయపడుతుంది. స్క్రీన్‌ప్లే క్రమంగా వ్యవస్థ అంతర్గత పనితీరుని విప్పుతూ పోతుంది. .ఈ క్రమంలో రెండు థ్రిల్లింగ్ రెండు ఎపిసోడ్‌లు ఉన్నాయి. వీటన్నిటితో కథకి కొత్త ఫీల్ నిచ్చే ఒక ఆకర్షణీయ సెటప్‌ ఏర్పడుతుంది. ఇంటర్వెల్ ఒక భావోద్వేగ మలుపుతో మరింత కట్టి పడేస్తుంది. ఇదంతా వెండితెర మీద చూసి రసానుభూతిని అనుభవించాలనే ఇక్కడ కథ విప్పడం లేదు. కథా లక్షణాలు మాత్రమే చెప్పాం.

అయితే ఇంతవరకూ రియలిస్టిక్ గా సాగుతున్న కథని నిగ్రహం తప్పి సెకండాఫ్ లో కమర్షియల్ పాల్జేయడంతో శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. జానర్ జంప్ సెకండాఫ్ ప్రాణాల మీదికి తెచ్చింది. అసలు థీమ్ కూడా ఫస్టాఫ్ లో ప్రామీజ్ చేసిన పొలిటికల్ థ్రిల్లర్ రూట్ నుంచి హీరో- విలన్ల సిగపట్లతో మాస్ ఎంటర్‌టైనర్ గా థీమ్ ని వదిలేసి – గందరగోళమై పోయింది. మొదలెట్టిన, కథేమిటి, ముగించిన కథేమిటి అంటూ చిక్కకుండా పోయింది. ఈ క్రమంలో సరైన విషయం లేకపోవడంతో క్లయిమాక్స్ ఉస్సూరన్పించే విధంగా తయారయ్యింది. ఇదన్న మాట రియలిస్టిక్ సినిమాల హీరో, దర్శకుడు కమర్షియల్ మీద చేతులేస్తే జరిగిన అనర్ధం.

నటనలు- సాంకేతికాలు
బ్రోకర్ గా విజయ్ ఆంటోనీ ఆకట్టుకునే సహజ నటన ప్రదర్శించాడు. నిజ జీవితలో రాజకీయ బ్రోకర్లు ఎలా ఉంటారో గమంచి ఈ పాత్రని తీర్చిదిద్దినట్టున్నారు. ఫస్టాఫ్ అన్ని సీన్లలో ఉర్రూత లూగిస్తాడు ఆంటోనీ. సెకండాఫ్ వచ్చేసరికే కథనీ, పాత్రనీ మర్చిపోయి మాస్ అవతారం ఎత్తుతాడు. ఈ మాస్ అవతారంలో ఫ్యాన్స్ కి తీవ్ర అసంతృప్తి కల్గిస్తాడు. పాత్ర దాంతో నటనా ఎలావున్నా తనే సమకూర్చిన సంగీతంతో కాస్త రిలీఫ్ కల్గిస్తాడు. సంగీత దర్శకుడుగా తను ఈ సినిమాకి హైలైట్.

భార్య పాత్రలో ఇక హీరోయిన్ తృప్తీ రవీందర్ వున్నా పెద్దగా తనకి ప్రాధాన్యం లేదు. విలన్ అభాయంకర్ గా నటించిన నటుడు కొత్తదనాన్ని అందిస్తాడు. మిగిలిన తారాగణం, సాంకేతిక విలువలూ మరీ గ్రాండ్ గా లేవుగానీ, ఈ కంటెంట్ కి ఈమాత్రం చాలన్నట్టుగా వున్నాయి.

దర్శకుడు అరుణ్ ప్రభు తన ‘అరువి’ శైలి నుంచి దూరం జరిగినా, కమర్షియల్ శైలితో ఒప్పించలేకపోయాడు. అయితే అతడి ఫస్టాఫ్ సబ్జెక్ట్ గురించి అతడి విస్తృత పరిశోధన, దాంతో ఫస్టాఫ్ ని జాగ్రత్తగా రూపొందించడం మాత్రం మెచ్చదగినవే.

రేటింగ్: 2.25/5

Purushottam Reddy Gives Clarity About Jagan Arrest | Telugu Rajyam