పుష్ప 2: నార్త్ లో ఆ స్థాయిలో ఎందుకు క్లిక్కయ్యిందంటే..

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తోంది. మొదటి రోజే హిందీలో 72 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. షారుఖ్ ఖాన్ రికార్డులను కూడా బ్రేక్ చేసింది. నార్త్ ఆడియన్స్ మామూలుగా డబ్బింగ్ సినిమాలకు ఇష్టపడకపోయినా, పుష్ప 2కు చూపిస్తున్న క్రేజ్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విజయానికి పలు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మొదటగా, ఈ చిత్రంలో నేటివిటీతో కూడిన మాస్ అంశాలు ప్రేక్షకులలో బలమైన ముద్రవేశాయి. ఊర మాస్ బ్యాక్‌డ్రాప్, పుష్పరాజ్ పాత్రలోని స్పష్టత, ఓపిక, గాండ్రించే ధోరణి నార్త్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామీణ వాతావరణంలో కథ నడిచినప్పటికీ, అక్కడి ప్రతి దృశ్యం అన్ని ప్రాంతాలకు అనుసంధానమవుతూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సామ్ సిఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఒక ప్రత్యేక శక్తిని తీసుకువచ్చాయి. పాటలే కాకుండా, ప్రతి సన్నివేశానికి ఇచ్చిన స్కోర్ కథానాయకుడి పాత్రను ఎలివేట్ చేస్తూ ప్రేక్షకులపై మరింత ప్రభావం చూపించింది. జాతర సన్నివేశంలో పాటల నడుమ చూపించిన ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రతి ఒక్కరినీ ఉర్రూతలూగించాయి.

ఇక అల్లు అర్జున్ నటనతో పుష్పరాజ్ పాత్రకు ప్రాణం పోశారు. కేవలం మాస్ క్యారెక్టర్ మాత్రమే కాకుండా, ఎమోషనల్ డెప్త్ ఉన్న పాత్రగా తీర్చిదిద్దిన పుష్పరాజ్ పాత్రను అర్జున్ తన ఎఫర్ట్‌తో మరింత హైలైట్ చేశారు. “తగ్గేదేలే” మ్యానరిజం, క్లైమాక్స్ ఫైట్, పోలీస్ స్టేషన్ సన్నివేశం వంటి సీన్స్ అతని పెర్ఫార్మెన్స్ పుష్ప 2 విజయానికి ప్రధాన కేరాఫ్‌గా నిలిచాయి